ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ఫ్రాంచైజీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరగనుండగా.. ఫ్రాంచైజీలన్నీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలను స్వీకరించింది.
అయితే రిటెన్షన్ పాలసీని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. గత మెగా వేలం రూల్స్ ప్రకారం ప్రతీ జట్టు గరిష్టంగా నలుగురు నుంచి ఐదుగురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలన్నీ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాతో పాటు వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముంబై తరఫున మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడాడు. అయితే మెగా వేలం రూల్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రిటైన్ చేసుకునే పరిస్థితి లేదు.
ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది.
దాంతో తిలక్ వర్మ వేలం బరిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఫ్రాంచైజీలకు ఆర్‌టీఎమ్(రైట్ టు మ్యాచ్) అవకాశాన్ని బీసీసీఐ కల్పిస్తే దాన్ని ముంబై.. తిలక్ వర్మ కోసం ఉపయోగించుకోవచ్చు.
అలా కూడా సాధ్యం కాకపోతే మాత్రం తిలక్ వర్మను కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది. విదేశీ ఆటగాళ్లపై పూర్తిగా ఆధారపడి ఉన్న హైదరాబాద్ జట్టు.. ఆ సమస్యను అధిగమించాలనుకుంటోంది. ఈ క్రమంలోనే మిడిలార్డర్‌లో సత్తా చాటగల తిలక్ వర్మను కొనుగోలు చేయాలనుకుంటోంది.
తిలక్ వర్మతో పాటు మరికొంత మంది భారత స్టార్ ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ పెట్టింది. తిలక్ వర్మను తీసుకుంటే లోకల్‌గా కూడా తమకు కలిసొస్తుందని ఆ జట్టు భావిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటం, లెఫ్టార్మ్ బ్యాటర్ కావడంతో తిలక్ వర్మకు మంచి డిమాండ్ ఉంది. అతని కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడనున్నాయి.