టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికి తప్పు చేశాడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. అతను టీ20 ప్రపంచకప్ 2026 వరకు పొట్టి ఫార్మాట్‌లో కొనసాగాల్సిందని అభిప్రాయపడ్డాడు. రిటైర్మెంట్ విషయంలో తొందరపడ్డాడని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది కోహ్లీకి ఈ సీజన్‌లో ఆరో హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సురేశ్ రైనా.. కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే విషయంలో విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు. అతను 2026 టీ20 ప్రపంచకప్ వరకు ఆడాల్సిందది. అతను ఆడుతున్న తీరు.. బ్యాటింగ్ రిథమ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన తీరును బట్టే ఈ మాట చెబుతున్నా. ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తున్న తీరు కూడా అతను పీక్‌లో ఉన్నట్లు తెలియజేస్తోంది.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన వెంటనే.. బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ.. తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు.. కోహ్లీని అనుసరించారు. అదే రోజు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం వన్డే, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 65.33 సగటు.. 144.12 స్ట్రైక్‌రేట్‌తో 392 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్(417) అగ్రస్థానంలో నిలిచాడు.