టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు పేర్లు ప్రస్తావించుకోకుండా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాడు. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన సమ్మిట్‌లో పాల్గొన్న గంభీర్.. సునీల్ గవాస్కర్ పేరు ప్రస్తావించకుండా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వారి జాగీరు కాదని, కొందరు కామెంటేటర్లు భారత క్రికెట్‌ను తమ వ్యక్తిగత ఆస్తిగా భావిస్తున్నారని గంభీర్ మండిపడ్డాడు. ఈ వ్యాఖ్యలపై మౌనంగా ఉన్న సునీల్ గవాస్కర్ అవకాశం కోసం ఎదురు చూసి.. విమర్శలు గుప్పించాడు.
స్టార్ స్పోర్ట్స్ షోలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని కొనియాడుతూ.. గంభీర్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ విజేతగా నిలవడంలో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడని, కానీ క్రెడిట్ మొత్తం డగౌట్‌లో కూర్చునే వ్యక్తులకు వెళ్లిందని అభిప్రాయపడ్డాడు. ఆ సీజన్‌లో కేకేఆర్‌కు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా పని చేశాడు. అతని పేరు ప్రస్తావించకుండా గవాస్కర్.. అతనిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.

డగౌట్‌లో కూర్చున్న వ్యక్తిది కాదు..
'గత సీజన్ ఐపీఎల్ విజయంలో శ్రేయస్ అయ్యర్‌కు సరైన క్రెడిట్ దక్కలేదు. ప్రశంసలన్నీ వేరొకరికి దక్కాయి. మైదానంలో ఏం చేయాలో.., వ్యూహాలు ఎలా అమలు చేయాలో నిర్ణయించడంలో కెప్టెన్ పాత్రే కీలకం. డగౌట్‌లో కూర్చున్న వ్యక్తిది కాదు కదా. ఈ సీజన్‌లో అయ్యర్‌కు సరైన గుర్తింపు లభిస్తోంది. ఎవరూ కూడా పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు క్రెడిట్ ఇవ్వడం లేదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అంకుముందు గంభీర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే గవాస్కర్ ఈ కామెంట్స్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా వారి జాగీరు కాదు..
గవాస్కర్‌ను ఉద్దేశించి గంభీర్ ఏమన్నాడంటే.. 'నేను టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 8 నెలలు మాత్రమే అవుతుంది. విమర్శలు తీసుకోవడానికి నేను సిద్దం. కామెంటేటర్లుగా వారి పనే అది. కానీ కొందరు 25 ఏళ్లుగా కామెంట్రీ బాక్స్‌లో కూర్చుంటూ.. నేను చేసే ప్రతీ పనిని ప్రశ్నిస్తున్నారు. వారు భారత క్రికెట్‌ను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. భారత క్రికెట్ ఎవరి సొంత జాగీరు కాదు.140 కోట్ల భారతీయులది.
వారు నా కోచింగ్, రికార్డ్స్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు నాకు లభించిన ప్రైజ్‌మనీని కూడా ప్రశ్నించారు. నేను డబ్బు ఎక్కడ దాచానో.. మరెక్కడ ఖర్చు చేశానో ఈ దేశానికి చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ప్రశ్నించే కామెంటేటర్లు విదేశాల్లో ఉంటూ ఎన్‌ఆర్‌ఐలుగా చెలామణి అవుతున్నారు. ఈ దేశంలో డబ్బు సంపాదించి, పన్నులు ఎగవేయడానికి ఎన్ఆర్‌ఐలుగా మారిన వ్యక్తులను ఈ దేశం ప్రశ్నించాలి. నేను భారతీయుడిని, నా చివరి శ్వాస వరకు భారతీయుడిగానే ఉంటాను. పన్ను ఆదా చేయడానికి నేను ఎన్‌ఆర్‌ఐగా మారను. గాజు ఇళ్లలో నివసించే వారు ఇతరుల ఇళ్లపై రాళ్లు విసిరే ముందు లక్షసార్లు తమను తాము ప్రశ్నించుకోవాలి.'అని గంభీర్ మండిపడ్డాడు.