ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు బెట్టింగ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్స్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సోషల్ ఇన్‌ప్లుయెన్సర్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
తెలుగు సోషల్ ఇన్‌ప్లుయెన్సర్స్ హర్ష సాయి, విష్ణు ప్రియ, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజులపై కేసులు నమోదైయ్యాయి. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా యువకులకు అవగాహన కల్పించడంతో పాటు సోషల్ ఇన్‌ప్లుయెన్సర్స్‌పై కన్నెర్ర చేస్తున్నారు.

ఆ యాప్స్‌నే నిషేధిస్తే..?
ఈ క్రమంలోనే మరికొంతమంది ఇన్‌ప్లుయెన్సర్స్ తమ తప్పిదం తెలుసుకొని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతున్నారు. తెలియక చేశామని, మళ్లీ ఎప్పుడూ ప్రమోట్ చేయమని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తెలిసో తెలియకనో లేక కాసులకు కక్కుర్తి పడో సోషల్ ఇన్‌ప్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సోషల్ ఇన్‌ప్లుయెన్సర్స్‌పై కేసులు పెట్టే బదులు.. ఆ యాప్స్‌నే పూర్తిగా నిషేధిస్తే సరిపోతుంది కదా? అనే వాదన సోషల్ మీడియా వేదికగా వినబడుతోంది.
అంతేకాకుండా చిన్నా చితక సోషల్ ఇన్‌ప్లుయెన్సర్స్‌పై కేసులు పెడుతున్న పోలీసులు.. సెలెబ్రిటీలపై కేసులు నమోదు చేస్తారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దేశంలో అనేక బెట్టింగ్ యాప్స్ అధికారికంగా చలామణి అవుతున్నాయి. వాటికి స్టార్ క్రికెటర్లు, సినిమా హీరోలు కూడా ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. సదరు యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలు కూడా అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌లో ప్రసారం అవుతున్నాయి. వీటిని కట్టడి చేసే దమ్ముందా? అనే వాదన సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది.
ప్రచారకర్తలుగా స్టార్ క్రికెటర్లు..?
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలతో పాటు పలువురు బడా క్రికెటర్లు, ఇతర దేశ ఆటగాళ్లు పలు అధికారిక ఫాంటసీ క్రికెట్ యాప్స్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకునే దమ్ము పోలీసులకు ఉందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతీ ఏటా ఐపీఎల్ జరిగే సమయంలో యాప్స్ వేదికగానే కొన్ని వేల కోట్ల రూపాయాలు చేతులు మారుతున్నాయి.
గతంలో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ బెట్టింగ్ ఇప్పుడు.. స్మార్ట్ ఫోన్స్ కారణంగా పల్లెలకు కూడా విస్తరించింది. ప్రతి 10 మంది క్రికెట్ అభిమానుల్లో ముగ్గురు బెట్టింగ్‌ల బారిన పడి నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బెట్టింగ్స్ యాప్స్‌ను పూర్తిగా నిషేధించాలని కోరుతున్నారు. సెలెబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా కఠిన చట్టాలు తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.