ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఫ్రాంచైజీలన్నీ సిద్దమవుతున్నాయి. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రిటెన్షన్ రూల్స్ ప్రకటించింది.
ప్రతీ జట్టుకు ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలనే నిబంధన పెట్టింది.
విదేశీ ఆటగాళ్లపై ఎలాంటి పరిమితి విధించలేదు. ఆరుగురి ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి.

నవంబర్ 30న మెగా వేలం..
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లు చెల్లించాలి. ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. అక్టోబర్ 31వ తేదీలోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది. నవంబర్ 30న మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఐసీసీ ఛైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టనున్నాడు.
బీసీసీఐ సెక్రటరీగా జై షా ఉండగానే మెగా వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకుందని ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. రిటెన్షన్ జాబితాలో తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌ను రూ. 23 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకున్నట్లు తెలుస్తోంది.
క్లాసెన్‌ను రూ. 23 కోట్లు
టాప్ స్లాబ్ 18 కోట్ల కంటే ఇది 27.7 శాతం ఎక్కువ. ఇదే జరిగితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా క్లాసెన్ నిలవనున్నాడు. ఐపీఎల్ 2024 మినీ వేలంలో మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రూ. 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఇదే ఆల్‌టైమ్ రికార్డ్ ధర.
మరోవైపు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రెండో రిటెన్షన్‌గా రూ. 18 కోట్లకు తీసుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఐపీఎల్ 2024 మినీ వేలంలో కమిన్స్‌ను సన్‌రైజర్స్ రూ. 20.5 కోట్ల భారీ ధరకు తీసుకుంది. కానీ ఈ సారి 13.8 శాతం తగ్గించి రిటైన్ చేసుకోనుంది. మూడో రిటెన్షన్‌గా యువ బ్యాటర్ అభిషేక్ శర్మను రూ. 14 కోట్లకు తీసుకోనుంది. గత మూడు సీజన్లలో అభిషేక్ శర్మ రూ. 6.50 కోట్ల వేతనాన్ని అందుకున్నాడు.
రేసులో రెడ్డి..
మిగతా రిటెన్షన్స్‌ను సన్‌రైజర్స్ ఖరారు చేయలేదు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిలను కూడా సన్‌రైజర్స్ రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తో నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. లేకుంటే అతన్ని అనామక ప్లేయర్‌గా రూ. 4 కోట్లకే సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకునేది.
బీసీసీఐ నిర్ణయించిన రిటెన్షన్ స్లాబ్స్ ధర కంటే ఎక్కువ ధర చెల్లించవచ్చా? అనే సందేహం అందరికి కలుగుతోంది. కానీ అది ఫ్రాంచైజీల వ్యక్తిగత నిర్ణయం. స్లాబ్స్ కంటే ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారి పర్స్ వాల్యూనే తగ్గుతుంది. తక్కువ డబ్బులతో వేలంలో పాల్గొనాల్సి వస్తోంది. ఐపీఎల్ 2018 మెగా వేలం సందర్భంగా ఆర్‌సీబీ కూడా ఇలానే బీసీసీఐ స్లాబ్ ప్రైజ్ రూ. 15 కోట్లు ఉంటే విరాట్ కోహ్లీకి రూ. 17 కోట్లు చెల్లించింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ. 17 కోట్లు ఇచ్చి తీసుకుంది.