టీమిండియా స్టార్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మహమ్మద్ షమీ సోదరి సబినా అంజుమ్ పేరు ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉండటం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద షమీ సోదరి సబినాతో పాటు ఆమె భర్త కూలీ డబ్బులు తీసుకున్నట్లు నేషనల్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది.
షబీనా, ఆమె భర్త ఉపాధి హారీ కార్మకులుగా పేర్లు నమోదు చేసుకున్నారని, 2021 నుంచి 2024 వరకు డబ్బులు కూడా తీసుకున్నారని ఈ కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ వార్తలపై షమీ కుటుంబ సభ్యులు కానీ, అతని సోదరి కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వీరే ఆ డబ్బులు తీసుకున్నారా? లేక వీరి పేర్లు వారి మరేవరైనా మోసానికి పాల్పడ్డారా? అనేది తేలాల్సి ఉంది.

ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు షమీ తల్లి, సోదరి హాజరయ్యారు. ఈ మ్యాచ్ సందర్భంగా వారితో కలిసి షమీ ఫొటోలు కూడా దిగాడు. చీలమండ గాయంతో 15 నెలలుగా ఆటకు దూరమైన షమీ.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన అతను.. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ ఆడుతున్నాడు.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను తొలి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. హైస్కోరింగ్ గేమ్‌లో 3 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఓ వికెట్ తీసాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకున్నఆరెంజ్ ఆర్మీ.. గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం షమీ సిద్దమవుతున్నాడు.