ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఓటమితో ఈ సీజన్‌ను ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆధిపత్యం చెలాయించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
గుజరాత్ టైటాన్స్ విజయాల్లో ఆ జట్టు హెచ్ కోచ్ ఆశీష్ నెహ్రా పాత్ర కీలకం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశిష్ నెహ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. నెహ్రా వ్యూహాలు అద్భుతమని కొనియాడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయానంతరం గుజరాత్ టైటాన్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు.

నెహ్రా కోచింగ్ అద్భుతం..
'తమ తొలి ఐపీఎల్ సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. వారి విధానం అద్భుతం. గుజరాత్ జట్టులో చాలా మంది క్రికెట్ నిష్ణాతులు ఉన్నారు. ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గా అద్భుతమైన పని తీరు కనబరుస్తున్నాడు.'అని సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్లో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్ నుంచి ఆశిష్ నెహ్రానే హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టును నడిపించిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు దక్కాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. 8వ స్థానంతో సరిపెట్టుకుంది.
దాదా నుంచే నేర్చుకున్నా..
సౌరవ్ గంగూలీ సారథ్యంలోనే ఆశిష్ నెహ్రా.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. స్వింగ్ బౌలర్‌గా అతనికి మంచి గుర్తింపు ఉంది. లీడర్‌షిప్ స్కిల్స్‌ను గంగూలీ నుంచే నేర్చుకున్నానని ఆశిష్ నెహ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'పరిస్థితులు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండటం ముఖ్యమనే విషయాన్ని సౌరవ్ గంగూలీ నుంచి నేర్చుకున్నాను. మైదానంలో ఆటగాడిగా అతన్ని ఇబ్బంది పెట్టిన ఆటగాళ్లలో నేను ఒకడిని.
కానీ మైదానంలో దాదా ఒక్క మాట కూడా అనేవాడు కాదు. కానీ సాయంత్రం ఫోన్ చేసి..'అశూ ఏం చేస్తున్నావ్? నా రూమ్‌కి రా? అని పిలిచేవాడు. మైదానంలో ఏం జరిగినా అక్కడే వదిలేయాలని గంగూలీ నమ్మేవాడు. జట్టును ఎలా నడిపించాలో? ప్రతీ ఆటగాడి నుంచి ఏమి కావాలో అతనికి స్పష్టం తెలుసు. ఈ క్రమంలో ఏ ఆటగాడైనా అతనిపై కోపం చూపించినా.. అతను పట్టించుకునేవాడు కాదు.'అని నెహ్రా తెలిపాడు.