చెత్త ఫీల్డింగ్ తమ ఓటమిని శాసించిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. మేం వదిలేసిన మూడు క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.
ఆ క్యాచ్‌లు పట్టుంటే..
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. బ్యాటింగ్‌లో ఆఖరి 3-4 ఓవర్లు కలిసి రాలేదన్నాడు. బౌలింగ్‌లో పేలవ ఫీల్డింగ్ కారణంగా 20 పరుగులు అదనంగా ఇచ్చామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఈ సీజన్‌లో తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందన్నాడు. 'ఇదో అద్భుతమైన క్రికెట్ మ్యాచ్. తృటిలో విజయాన్ని చేజార్చుకున్నాం. చివరి 3-4 ఓవర్లు మాకు కలిసి రాలేదు. అయినా మేం బాగా ఆడాం. మేం మూడు సునాయస క్యాచ్‌లు వదిలేసాం. పవర్ ప్లేలోనే ఈజీ క్యాచ్‌లు వదిలేస్తే బౌలర్లు పరుగులను నియంత్రించలేరు. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడారు.

ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. డ్యూ కారణంగా పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. చివరి 2-3 మ్యాచ్‌లు మాకు కలిసి రాలేదు. కానీ మా ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో మాకు కీలకంగా మారాడు. ఈ వికెట్‌పై 210 పరుగులే ఎక్కవ. మేం అదనంగా 20 పరుగులిచ్చాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జానీ బెయిర్ స్టో(22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 33), హార్దిక్ పాండ్యా(9 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 నాటౌట్) దూకుడుగా ఆడారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 80), వాషింగ్టన్ సుందర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) పోరాడినా ఫలితం లేకపోయింది.