హార్దిక్ పాండ్యాతో విభేదాలు అంటూ వచ్చిన వార్తలపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, సోషల్ మీడియాలో చూసే ప్రతీ విషయాన్ని నమ్మవద్దని అభిమానులను కోరాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఒకరినొకరు చూసుకోకపోవడం, విష్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. టాస్ సందర్భంగా ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. హార్దిక్ పాండ్యా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. గిల్ పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోయాడని, ఆ తర్వాత గిల్ ఔటైనప్పుడు హార్దిక్ దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వైరల్ చేశారు. దాంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది భావించారు.

టీమిండియా కెప్టెన్సీ విషయంలో ఇద్దరి ఇగో క్లాష్ మొదలైందని చాలా మంది అనుకున్నారు. అయితే, ఈ ప్రచారంపై శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన శుభ్‌మన్ గిల్.. తమ మధ్య మంచి అనుబంధం, ప్రేమ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాడు. 'ప్రేమకు మించి ఏది లేదు.. ఇంటర్నెట్‌లో చూసే ప్రతీది నమ్మవద్దు'అనే క్యాప్షన్‌తో హార్దిక్ పాండ్యాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.
రోహిత్ శర్మ వారసుడిగా శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనతో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన గుజరాత్ టైటాన్స్.. కీలక ఎలిమినేటర్‌లో ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా గుజరాత్‌కు విజయం దక్కలేదు.
