ఐపీఎల్ 2025 ఫైనల్ నేపథ్యంలో తాను 4 గంటలు మాత్రమే నిద్రపోయానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. పడుకొని లేచసరికే ప్రెస్ కాన్ఫరెన్స్ టైమ్ అయ్యిందని తెలిపాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రేయస్ అయ్యర్(87 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక్క ఓవర్ కుదించకుండా ఆడించడంతో అర్థరాత్రి 1.40 గంటలకు మ్యాచ్ ముగిసింది.
సోమవారం ఉదయమే ప్రీ ఫైనల్ వర్క్స్‌లో శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఆర్‌సీబీతో ఫైనల్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న అయ్యర్.. నిద్ర సరిపోలేదని తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో సరిగ్గా నిద్రపట్టలేదన్నాడు. నాలుగు గంటలు మాత్రమే పడుకున్నానని చెప్పాడు.

'నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడే(ప్రెస్ కాన్ఫరెన్స్) ఉన్నాను. క్వాలిఫయర్-2 మ్యాచ్ తర్వాత నేను నా గదికి వెళ్లాను. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నాను," అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అన్నాడు. ఫైనల్ నేపథ్యంలో సరిగ్గా నిద్రపట్టలేదని, ఎప్పుడెప్పుడు ఆడుతామా? అనే ఉత్సాహంతో పాటు ఆందోళన ఉందని చెప్పాడు.
ముంబై ఇండియన్స్‌తో ఆడిన ఇన్నింగ్స్.. ఐపీఎల్‌లోనే తన అత్యుత్తమ ఇన్నింగ్స్ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్.. ఆ జట్టును విజేతగా నిలబెట్టాడు. తాజా పంజాబ్ కింగ్స్‌కు తొలి టైటిల్ అందించాలనే ఆశతో ఉన్నాడు. ఐపీఎల్ 2020లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్.. టైటిల్ అందించలేకపోయాడు. ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా చరిత్ర కెక్కిన అయ్యర్.. పంజాబ్‌కు టైటిల్ అందించి రెండు వేర్వేరు జట్లను ఛాంపియన్‌గా నిలబెట్టిన సారథిగా నిలవాలనుకుంటున్నాడు.