స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయపడటం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అతను ఉండి ఉంటే జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీసేవాడని అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. పేలవ బౌలింగ్‌తో పంజాబ్ 245 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. అభిషేక్ శర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141), ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) విధ్వంసంతో పంజాబ్ భారీ లక్ష్యం చిన్నబోయింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. తమ బౌలింగ్ రొటేషన్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. అభిషేక్ శర్మ-ట్రావిస్ హెడ్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయకపోవడం.. కీలక క్యాచ్‌లు వదిలేయడం తమ ఓటమిని శాసించిందని అయ్యర్ తెలిపాడు.

నాకు నవ్వొస్తుంది..
'నిజం చెప్పాలంటే ఇదో అసాధారణమైన లక్ష్యం. ఈ టార్గెట్‌ను సన్‌రైజర్స్ 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించిందంటే నాకు నవ్వొస్తుంది. మేం కొన్ని క్యాచ్‌లను అందుకోలేకపోయాం. ఈ రోజు అభిషేక్ శర్మ చాలా లక్కీ. అతను అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. మేం మా అంచనాలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. మేం మా తప్పిదాల గురించి మాట్లాడుకొని సవరించుకుంటాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ భాగస్వామ్యం అద్భుతం. వారు మాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. మా బౌలింగ్ రొటేషన్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది.
ఔట్ ఆఫ్ ది వరల్డ్..
ఆ తప్పిదాలను సరి చేసుకుంటాం. ఫెర్గూసన్ గాయం మాకు నష్టం చేసింది. అవసరమైనప్పుడల్లా అతను వికెట్లు తీసేవాడు. కానీ గాయాలు సహజం. ఆటలో భాగం. ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. నేను, వధేరా బ్యాటింగ్ చేసేటప్పుడు 230 పరుగుల టార్గెట్ మంచిది అనుకున్నాం. కానీ డ్యూ రావడంతో మా బౌలర్లకు కష్టమైంది. సన్‌రైజర్స్ ఓపెనర్ల బ్యాటింగ్.. ఔట్ ఆఫ్ ది వరల్డ్. నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఒకటి'అని శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు.
అయ్యర్ పోరాటం వృథా
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు. హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసారు.