రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని ధాటికి ఖలీల్ అహ్మద్ ఒకే ఓవర్‌లో 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో షెపర్డ్ వరుసగా 6, 6, 4, 6, 6nb, 0, 4 బౌండరీలు బాది 33 పరుగులు పిండుకున్నాడు.
పాపం ఖలీల్..
ఈ ఓవర్ తొలి బంతిని ఖలీల్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా నెమ్మదిగా వేయగా.. షెపర్డ్ పుల్ షాట్‌తో ఓవర్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ తరలించాడు. రెండో బంతిని ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి లెగ్ సైడ్ సిక్సర్ కొట్టాడు. ఆఫ్ కట్టర్‌గా వేసిన మూడో బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదాడు. ఫుల్‌టాస్‌గా వేసిన నాలుగో బంతిని లెగ్ సైడ్ సిక్సర్ కొట్టాడు. ఐదో బంతిని నోబాల్‌గా వేయగా.. ఓవర్ పాయింట్ దిశగా సిక్సర్ బాదాడు. ఫ్రీ హిట్ బాల్‌ను వదిలేసిన షెపర్డ్.. ఆఖరి బంతిని ఫార్ట్ ఫైన్ దిశగా బౌండరీ తరలించి ఖలీల్‌కు ఈ రోజును పీడ కలగా మార్చాడు. ఈ సీజన్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఓవర్‌గా ఇది నిలిచింది. సీఎస్‌కే తరఫున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఖలీల్ అహ్మద్ తన పేరిట చెత్త రికార్డ్ లిఖించుకున్నాడు.

16 నిమిషాల్లో భీభత్సం..
16 నిమిషాలు మాత్రమే క్రీజులో ఉన్న రొమారియో షెపర్డ్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో వీర విహారం చేశాడు. ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డ్.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. అతను 2023లో కేకేఆర్‌పై 13 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్, రొమారియో షెఫర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
చివరి 2 ఓవర్లలో 54 రన్స్..
రొమారియో షెఫర్డ్ విధ్వంసంతో ఆర్‌సీబీ చివరి రెండు ఓవర్లలో 54 పరుగులు చేసింది. అతనికి తోడుగా.. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62), జాకోబ్ బెతెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో మతీష పతీరణ(3/30) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కరణ్ చెరో వికెట్ పడగొట్టారు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఖలీల్ అహ్మద్(0/65) ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.