ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సీఎస్‌కేను చిత్తు చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
ఈ సందర్భంగా మాట్లాడిన రోహిత్ శర్మ తన బ్యాటింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన బ్యాటింగ్‌ను సీఎస్‌కే ఫ్యాన్స్ కూడా ఆస్వాదించడంపై సంతోషం వ్యక్తం చేసిన రోహిత్.. వారు క్రికెట్ అభిమానులని, ఆటను ఆస్వాదిస్తారని చెప్పుకొచ్చాడు. వాంఖడే స్టేడియంలో తన పేరిట స్టాండ్ పెట్టడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చిందన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటం కష్టంగా ఉందని చెప్పిన రోహిత్.. జట్టు అవసరాల కోసం తప్పడం లేదన్నాడు.

వాళ్లు క్రికెట్ ఫ్యాన్స్..
'నా ఆటను ఆస్వాదించిన సీఎస్‌కే ఫ్యాన్స్.. క్రికెట్ ప్రేమికులు. ఇది వాంఖడే స్పెషల్. వారు ఈ రోజు ఆటను ఆస్వాదించాలనుకున్నారు. ఈ మ్యాచ్ మేం ఆశించిన విధంగా సాగింది. సుదీర్ఘ కాలంగా విఫలమైతే.. ఎవరికైనా వారి ఆటపై సందేహం మొదలవుతోంది. విభిన్నంగా ప్రయత్నించేలా చేస్తుంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో పరిస్థితులను సింపుల్‌గా ఉంచుతూ.. క్లియర్ మైండ్‌సెట్‌తో ఆడాలనుకున్నాను. ఎలాంటి షాట్స్ ఆడాలి? ఇన్నింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నదానిపై ఫోకస్ పెట్టాను. నా బలాలకు తగ్గట్లు ఆడాను. నెట్స్‌లో మరింత ఎక్కువ కష్టపడ్డాను. ఎప్పుడైనా నా ఆర్క్‌లో బంతి పడితే అస్సలు వదలను.
అందుకే ఇంపాక్ట్ ప్లేయర్‌గా..
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం అనేది జట్టు నిర్ణయం. దీనిపై మేం సుదీర్ఘంగా చర్చించాం. 17 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయకుండా.. 2-3 ఓవర్లు మైదానంలోకి రావడం వల్ల జట్టుకు ఒరిగేది ఏం లేదు. కొన్ని మ్యాచ్‌ల్లో నేను చివర్లో ఫీల్డింగ్ చేశాను. కానీ జట్టుకు ఏం ఉపయోగపడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ ఆడటం కాస్త కష్టంగానే ఉంది. కానీ దీన్ని నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. నేను నేరుగా వచ్చి బ్యాటింగ్ చేయాలని టీమ్ కోరుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
ఒకప్పుడు స్టేడియానికి అనుమతించలేదు..
కుర్రాడిగా ఈ మైదానాకి వచ్చిన ఆటను ఆస్వాదించిన నాకు.. నా పేరిట స్టాండ్ పెట్టడం.. ఆ స్టాండ్ వైపు సిక్స్ కొట్టడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. కొన్నిసార్లు ఈ మైదానంలోకి మమ్మల్ని అనుమతించేవారు కాదు. ఈ మైదానంలోనే ఆటగాడిగా పెరిగాను. ఇప్పుడు నా పేరిటే ఓ స్టాండ్ పెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియలేదు. ఈ మ్యాచ్‌ను ముగించడం చాలా సంతృప్తినిచ్చింది. మైం సరైన సమయంలో పుంజుకున్నాం. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచాం. వరుసగా మ్యాచ్‌లు గెలవడం చాలా కీలకం. ప్రస్తుతం మేం మెరుగైన స్థితిలో ఉన్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
రోహిత్, సూర్య విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే ఒక వికెట్ తీసాడు.