ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్‌ను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తెచ్చుకొని సారథ్య బాధ్యతలను అప్పగించింది. జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో వివరణ ఇచ్చింది.

ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ కొంపముంచింది. కెప్టెన్సీ మార్పును ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా అంగీకరించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు బహిరంగంగానే ఈ నిర్ణయం తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
జట్టు కూడా రెండు గ్రూప్‌లుగా విడిపోయిందని ప్రచారం జరిగింది. మైదానంలోని ఆటగాళ్ల వ్యవహారం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. భారత ఆటగాడనే విషయాన్ని మరిచి ప్రతీ మ్యాచ్ సందర్భంగా గేలి చేశారు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతని సతమణి రితికా సజ్దే సోషల్ మీడియా వేదికగానే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌ను నిలదీస్తూ పోస్ట్‌లు పెట్టింది.
ఇదంతా టీమ్ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపింది. దాంతో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌లకు 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగుస్థానంలో నిలిచింది. కెప్టెన్సీ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ శర్మ మాట్లాడిన సంభాషణ వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో ముంబై పేరును ప్రస్తావించకుండా.. ఆ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని రోహిత్ అన్నాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంపై రోహిత్.. బ్రాడ్‌కాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు స్వేచ్చ లేకుండా పోయిందని, ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేయవద్దని మందలించాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడుతాడనే వార్తల నేపథ్యంలో ఇతర ఫ్రాంచైజీలు అతన్ని తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రోహిత్ శర్మ కోసం ఏకంగా రూ. 50 కోట్లు సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే రోహిత్ శర్మను వదులుకుంటే తమ బ్రాండ్ వాల్యూ పడిపోతుందని గ్రహించిన ముంబై ఇండియన్స్.. బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టిందని, తిరిగి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చేందుకు సిద్దంగా ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.