ఐపీఎల్ 2025 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ వీడనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. దాంతో అన్ని జట్లలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.
మెగా వేలం రూల్స్ ప్రకారం నలుగురు, ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ ప్రణాళికలు మొదలుపెట్టింది. ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రిటెన్షన్ పాలసీని రూపొందించడంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే 10 ఫ్రాంచైజీల ఓనర్లతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. అతి త్వరలోనే రిటెన్షన్ పాలసీని ప్రకటించనుంది. అయితే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పు విషయంలో అసంతృప్తిగా ఉన్న ఈ ఇద్దరూ ఇతర జట్లలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను తమ నయా సారథిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ముంబై ఇండియన్స్ జట్టులో విబేధాలు తలెత్తాయి. హార్దిక్ పాండ్యాకు సీనియర్లు ఎవరూ సహకరించలేదు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌కు రోహిత్, సూర్య ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఈ ఇద్దరిలో ఒకరు ఢిల్లీ క్యాపిటల్స్, మరొకరు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. అయితే రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉండటంతో టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.