గత 17 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వచ్చే ఏడాది అయినా ఆ ముచ్చట తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ.. ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరగనుండగా.. బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. మరోవైపు ఫ్రాంచైజీలు మాత్రం తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. మెగా వేలంలో ఆర్‌సీబీ.. భారత్‌కు చెందిన పేస్ ఆల్‌రౌండర్లను కొనుగోలు చేయాలనుకుంటుంది. ఇందు కోసం కొంతమంది ఆటగాళ్లను టార్గెట్ చేసింది.

ఈ జాబితాలో ఆంధ్ర క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఉన్నట్లు తెలుస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల పేస్ ఆల్‌రౌండర్ కోసం చాలా ఏళ్లుగా ఆర్‌సీబీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిని వేలంలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
పేస్ ఆల్‌రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే టీమ్ కాంబినేషన్‌లో సమతూకం వస్తుందని భావిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీష్ కుమార్ రెడ్డి సంచలన ప్రదర్శన చేశాడు. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్‌ను కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో అతను టీమిండియా స్టార్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డికి ఆర్‌సీబీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే అతనికి బ్యాకప్‌గా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ఆర్‌సీబీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో సచిన్ టెండూల్కర్ బంతితో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది.
ఈ ప్రదర్శన అర్జున్ టెండూల్కర్ సత్తాను తెలియజేసింది. అర్జున్ టెండూల్కర్‌కు సరైన అవకాశాలు ఇచ్చిన సాన బెడితే మంచి ఆల్‌రౌండర్ అవుతాడని ఆ జట్టు భావిస్తోంది.