రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. విరాట్ కోహ్లీ బొటన వేలికి తీవ్ర గాయమైంది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద కోహ్లీ బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. క్యాచ్ కోసం ముందుకెళ్లిన కోహ్లీ.. బంతి ముందే పడటంతో అడ్డుకోలేకపోయాడు. ఈ క్రమంలో బంతి అతని బొటన వేలికి బలంగా తాకింది.
ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స తీసుకున్న కోహ్లీ.. ఫీల్డింగ్ కొనసాగించాడు. కానీ అసౌకర్యంగా కనిపించాడు. పదేపదే తన బొటన వేలిని రుద్దుకుంటూ కనిపించాడు. ఈ ఘటన ఆర్‌సీబీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. విరాట్ కోహ్లీ గాయం చిన్నదా? పెద్దదా? అని ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ గాయంపై ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందించాడు. కోహ్లీ గాయం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, అతను బాగానే ఉన్నాడని చెప్పాడు. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(40 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేష్ శర్మ(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33), టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 17.2 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జోస్ బట్లర్(39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయి సుదర్శన్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49)రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్ తలో వికెట్ తీసారు.