ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగియడంతో అందరి దృష్టి ఐపీఎల్ 2025పై నెలకొంది. ఈ నెల 22న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే పది ఫ్రాంచైజీలు తమ ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలవడంతో స్టార్ ఆటగాళ్లు సైతం తమ జట్ల ప్రాక్టీస్ క్యాంప్‌ల్లో చేరుతున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సంబరాలను బీసీసీఐ నిర్వహించడం లేదు. దాంతో టీమిండియా ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇందులో కొందరు విశ్రాంతి తీసుకుంటుండగా.. మరికొందరు ఐపీఎల్ ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొంటున్నారు. బౌండరీతో భారత విజయలాంఛనాన్ని పూర్తి చేసి గంగ్నమ్ డ్యాన్స్‌తో సందడి చేసిన జడేజా ఐపీఎల్ 2025కి సిద్దమవుతున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ విజయసంబరాలను త్వరగానే ముగించుకున్నజడేజా.. ఇంటికి కూడా వెళ్లకుండానే చెన్నైలో అడుగుపెట్టాడు. సీఎస్‌కే ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరేందుకు సిద్దమయ్యాడు. పుష్ప స్టైల్‌లో జడేజా టీమ్ హోటల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే 'వైల్డ్‌ఫైర్ కోసం మీ స్క్రీన్స్ సెట్టింగ్ చేసుకోండి'అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో జడేజా.. పుష్ప హీరో అల్లు అర్జున్ మ్యానరిజంతో అలరించాడు. 'జడ్డూ అంటే పేరు కాదు.. జడ్డూ బ్రాండ్'.. 'నీ అవ్వ తగ్గేదేలే' అనే డైలాగ్స్‌ను జడేజా హిందీలో చెప్పాడు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రవీంద్ర జడేజాను సీఎస్‌కే రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో మార్చి 23న చెన్నై వేదికగానే ఆడనుంది.
సీఎస్‌కే పూర్తి జట్టు:
రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు), డేవన్ కాన్వే(రూ. 6.25 కోట్లు), రాహుల్ త్రిపాఠి(రూ. 3.4 కోట్లు), రచిన్ రవీంద్ర(రూ. 4 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్(రూ. 9.75 కోట్లు), ఖలీల్ అహ్మద్(రూ. 4.80 కోట్లు), నూర్ అహ్మద్(రూ. 10 కోట్లు), విజయ్ శంకర్(రూ. 1.2 కోట్లు), సామ్ కరణ్(రూ. 2.4 కోట్లు), షేక్ రషీద్(రూ. 30 లక్షలు), అన్షుల్ కంబోజ్(రూ. 3.4 కోట్లు), ముఖేష్ చౌదరి(రూ. 30 లక్షలు), దీపక్ హు డా(రూ. 1.7 కోట్లు), గుర్జప్‌నీత్ సింగ్(రూ. 2.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ. 2 కోట్లు), జామీ ఓవర్టన్(రూ. 1.5 కోట్లు), కమలేష్ నాగర్‌కోటీ(రూ. 30 లక్షలు), రామకృష్ణ ఘోష్(రూ. 30 లక్షలు), శ్రేయస్ గోపాల్(రూ. 30 లక్షలు), వాన్షి బేడీ(రూ. 55 లక్షలు), ఆండ్రే సిద్దార్థ్(రూ. 30 లక్షలు)