ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ పోరాటం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శనివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయ్యింది. దాంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ అధికారికంగా నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచినా.. ప్లే ఆఫ్స్ చేరలేదు.
కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, రెండు మ్యాచ్‌ల రద్దుతో 12 పాయింట్స్‌తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆరెంజ్ ఆర్మీతో జరిగే ఆఖరి మ్యాచ్ గెలిచినా కేకేఆర్ ఖాతాలో 14 పాయింట్స్ ఉంటాయి. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దవ్వడంతో ప్లే ఆఫ్స్ సమీకరణం రసవత్తరంగా మారింది. కేకేఆర్ రన్‌రేట్ కూడా 0.193 మెరుగ్గా లేకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పటికే టాప్-4లో ఉన్న జట్లు 14 ప్లస్ పాయింట్స్‌తో మెరుగైన రన్‌రేట్‌తో ఉన్నాయి. కాబట్టి కేకేఆర్ 14 పాయింట్స్ సాధించినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

కొంపముంచిన వరణుడు..
గత సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్.. ఈ సీజన్‌లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. ఓటమితో ఈ సీజన్ ప్రారంభించిన కేకేఆర్.. ఓ విజయం.. మరో పరాజయం అన్నట్లు తమ ప్రయాణాన్ని సాగించింది. ఏప్రిల్ 29న పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. 13 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడం.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. ఈ రెండు మ్యాచ్‌లు జరిగి.. కేకేఆర్‌కు అనుకూలంగా ఫలితం వచ్చి ఉంటే ఆ జట్టు పరిస్థితి మరోలా ఉండేది.
స్టార్ ఆటగాళ్ల వైఫల్యం..
కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్ దారుణంగా విఫలమవడం.. సునీల్ నరైన్ తేలిపోవడం.. వరుణ్ చక్రవర్తీ పెద్దగా ప్రభావం చూపకపోవడం కేకేఆర్ విజయవకాశాలను దెబ్బతీసాయి. రింకూ సింగ్ వైఫల్యం కూడా కేకేఆర్ పతనాన్ని శాసించింది. చివర్లో ఆండ్రీ రస్సెల్ ఫామ్‌లోకి వచ్చినా ఫలితం లేకపోయింది.