Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: కొంపముంచిన అశ్వని కుమార్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ముంబై

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్‌లో మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో తలపడనుంది. శ్రేయస్ అయ్యర్(41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 నాటౌట్)విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)లతో పాటు నమన్ ధీర్(18 బంతుల్లో 7 ఫోర్లతో 37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టోయినీస్, విజయ్‌కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్‌తో పాటు నెహాల్ వధేరా(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), జోష్ ఇంగ్లీస్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. పంజాబ్ తాజా విజయంతో అభిమానులు ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్‌ను చూడనున్నారు.

IPL 2025 Qualifier 2 Shreyas Iyer s 87 Powers PBKS to Victory Over MI Seals Final Berth

జోష్ ఇంగ్లీస్ దూకుడు..
204 పరుగుల లక్ష్యచేధనలో పంజాబ్‌ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రా సింగ్(6) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లీస్, మరో ఓపెనర్ ప్రియాన్ష్ దూకుడుగా ఆడారు. జోష్ ఇంగ్లీస్ వచ్చి రావడంతోనే వరుసగా రెండు బౌండరీలు బాదగా.. ప్రియాన్ష్ ఆర్య ఓ ఫోర్, సిక్సర్‌తో బ్యాట్‌కు పనిచెప్పాడు. బుమ్రా వేసిన ఐదో ఓవర్‌లో జోష్ ఇంగ్లీస్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది 20 పరుగులు పిండుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అశ్వని కుమార్ విడదీసాడు. ప్రియాన్ష్ ఆర్యను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 42 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆదుకున్న అయ్యర్, వధేరా..
క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ రాగా.. జోష్ ఇంగ్లీస్‌ను హార్దిక్ పాండ్యా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. నెహాల్ వధేరాతో కలిసి అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలించింది. రీస్ టోప్లీ వేసిన 13వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. నెహాల్ వదేరా కూడా పోటాపడి బౌండరీలు బాదడంతో పంజాబ్ స్కోర్ పరుగెత్తింది. హాఫ్ సెంచరీకి చేరువైన నెహాల్ వధేరాను అశ్వని కుమార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శశాంక్ సింగ రాగా.. శ్రేయస్ అయ్యర్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ త్రోకు శశాంక్ సింగ్ రనౌటయ్యాడు.

కొంపముంచిన అశ్వని కుమార్..
బుమ్రా వేసిన 18వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ బౌండరీ సాయంతో 8 పరుగులు రాబట్టాడు. దాంతో చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. అశ్వని కుమార్ వేసిన 19వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ నాలుగు సిక్స్‌లు బాది పంజాబ్ కింగ్స్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవర్‌లో అశ్వని కుమార్ నో బాల్ వేయడం పంజాబ్‌కు కలిసొచ్చింది.

Story first published: Monday, June 2, 2025, 1:50 [IST]
Other articles published on Jun 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+