ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి ఐకానిక్ నోట్ బుక్ సెలెబ్రేషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యతో కయ్యానికి తెరలేపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దిగ్వేష్ రతి వేసిన ఈ ఓవర్ తొలి బంతిని ప్రియాన్ష్ ఆర్య బౌండరీకి తరలించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఫుల్‌గా వేసిన రెండో బంతిని కూడా ప్రియాన్ష్ డ్రైవ్ షాట్‌తో బౌండరీ బాదే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లో ఉన్న మిచెల్ మార్ష్ దిశగా దూసుకెళ్లింది. కానీ అతను క్యాచ్ పట్టలేకపోయాడు.

నోట్‌బుక్ సెలెబ్రేషన్స్‌తో..
ఇదే ఓవర్ ఐదో బంతిని ప్రియాన్ష్ ఆర్య పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. మిస్‌టైమ్ అయిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో శార్దూల్ ఠాకూర్ సునాయస క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే ప్రియాన్ష్ ఆర్య దగ్గరకు పరుగెత్తిన దిగ్వేష్ రతి.. నోట్‌బుక్‌లో రాసుకుంటున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలను తప్పుబడుతూ.. ఫీల్డ్ అంపైర్.. దిగ్వేష్ రతికి వార్నింగ్ ఇచ్చాడు.
గతంలో విండీస్ పేసర్..
గతంలో వెస్టిండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ ఇలానే సంబరాలు చేసుకునేవాడు. అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అతన్ని చితక్కొట్టి.. నోట్‌బుక్ సెలెబ్రేషన్స్‌తో అతనికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్రచర్చనీయాంశమైంది. దాంతోనే నోట్‌బుక్ సెలెబ్రేషన్ ఐకానిక్‌గా నిలిచిపోయింది. తాజాగా దిగ్వేష్ రతి మరోసారి ఈ ఐకానిక్ సంబరాలను గుర్తు చేశాడు.
పంజాబ్ కింగ్స్ కౌంటర్..
అయితే నోట్ బుక్ సెలెబ్రేషన్స్‌తో కయ్యానికి కాలు దువ్విన దిగ్వేష్ రతికి.. ప్రియాన్ష్ ఆర్య దిమ్మతిరిగే బదులిస్తాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా దిగ్వేష్ రతిని తమదైన శైలిలో ట్రోల్ చేసింది. ఈ నోట్‌బుక్ సెలెట్రేషన్స్ ఫొటోను షేర్ చేసి.. మరో విజయం ఖాతాలో వేసుకున్నామని సెటైర్లు పేల్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఎక్స్‌ట్రాలు వద్దురా చిన్నోడా..అని పంజాబ్ కింగ్స్ తమ పోస్ట్‌తో దిగ్వేష్ రతిని హెచ్చరించిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
చిత్తయిన లక్నో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. యువ బ్యాటర్లు ఆయుష్ బదోని(33 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 41), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) తో పాటు నికోలస్ పూరన్(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/39) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69), శ్రేయస్ అయ్యర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. నెహాల్ వధేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.