ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. అనూహ్యంగా మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక ఆర్‌టీఎమ్ కార్డు కూడా ఉంది. ప్రతీ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టీమ్ పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు.
రిటైన్ చేసుకునే ఈ ఆరుగురి ఆటగాళ్లలో విదేశీ ప్లేయర్లపై పరిమితి లేదు. కానీ అనామక ఆటగాళ్లను ఇద్దర్నీ తీసుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్లుగా పరిగణించే పాత రూల్‌ను కూడా బీసీసీఐ మళ్లీ ప్రవేశపెట్టింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు గరిష్టంగా రూ. 18 కోట్లు, అనామక ఆటగాళ్లకు రూ. 4 కోట్లు చెల్లించాలని పేర్కొంది.

నో ఫాఫ్.. మ్యాక్సీ
అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది. దాంతో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ లిస్ట్‌పై ఫోకస్ పెట్టాయి. గత 17 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
వయసు దృష్ట్యా తమ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ వేలంలోకి వదిలేయవచ్చు. అవసరమైతే వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించి తిరిగి కొనుగోలు చేయవచ్చు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను కూడా ఆర్‌సీబీ వదులుకునే అవకాశం ఉంది.
ఆర్‌సీబీ రిటైన్ష్ (అంచనా)
1.విరాట్ కోహ్లీ
ఆర్‌సీబీ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ఆర్‌సీబీకి ఇంత క్రేజ్ వచ్చిందంటే.. దానికి ప్రధాన కారణం కోహ్లీ. అతని చుట్టే జట్టును నిర్మించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022 మెగావేలంలో జట్టు కోసం కోహ్లీ తన ధరను రూ. 14 కోట్లకు తగ్గించుకున్నాడు. ఈ సారి కూడా అతను మూడో ప్లేయర్‌గా రూ. 11 కోట్లే తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కోహ్లీ.. ఐపీఎల్‌లో 8 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. గత సీజన్‌లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు.
2. కామెరూన్ గ్రీన్..
ఆర్‌సీబీ తమ రెండో ప్లేయర్‌గా కామెరూన్ గ్రీన్‌ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఎంతో విలువైన ఈ ఆల్‌రౌండర్ కోసం ఆర్‌సీబీ రూ. 15- 18 కోట్లు ఖర్చు చేయవచ్చు. రిటెన్షన్ ధర ఎక్కువ? అని భావిస్తే ఆర్‌టీఎమ్ ద్వారా తీసుకోవచ్చు. గత సీజన్‌లో గ్రీన్.. 13 మ్యాచ్‌ల్లో 225 పరుగులతో పాటు 10 వికెట్లు తీసాడు. ఒకవేళ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం అతను గ్రీన్‌కు పోటీదారుడు అవుతాడు.
3. ఆకాశ్‌దీప్..
టీమిండియా రైజింగ్ స్టార్ ఆకాశ్‌దీప్‌ను కూడా ఆర్‌సీబీ రిటైన్ చేసుకోవచ్చు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన ఆకాశ్‌దీప్‌ను తక్కువ ధరకే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.
4. మహమ్మద్ సిరాజ్..
స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా ఆర్‌సీబీ రిటైన్ చేసుకోనుంది. గత సీజన్‌లో అతను 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసాడు. తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో సిరాజ్ బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తనకు అచ్చొచ్చిన రోజున సిరాజ్.. ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తాడు. ఇప్పటి వరకు 93 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 93 వికెట్లు తీసాడు.
5. రజత్ పటీదార్..
టీమిండియా యువ బ్యాటర్ రజత్ పటీదార్‌ను కూడా ఆర్‌సీబీ రిటైన్ చేసుకోవచ్చు. గత సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన రజత్ పటీదార్ 395 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో సెంచరీతో తాను ఎంత విలువైన ఆటగాడినో చాటి చెప్పాడు. మిడిలార్డర్‌లో కీలకం కానున్నాడు. రజత్ పటీదార్ కోసం ఆర్‌టీఎమ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
6. యశ్ దయాల్..
ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన బౌలింగ్‌తో ఆర్‌సీబీని ప్లే ఆఫ్స్ చేర్చిన యశ్ దయాల్‌ను అనామక ప్లేయర్ కోటాలో రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సీఎస్‌కేతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యశ్ దయాల్.. ధోనీని ఔట్ చేయడంతో పాటు ఆఖరి ఓవర్‌లో లక్ష్యాన్ని డిఫెండ్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఫస్టాఫ్ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. కానీ కీలక మ్యాచ్‌లో ఆ జోరు కనబర్చలేకపోయింది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ మెగా వేలం వ్యూహాలు ఎలా ఉంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది.