ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మొత్తం 1574 మంది మెగా వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకోగా.. బీసీసీఐ 574 మంది షార్ట్ లిస్ట్ చేసింది.
నవంబర్ 24, 25(ఆది, సోమవారం) తేదీల్లో సౌదీ అరేబియాలో జెడ్డా వేదికగా మెగా వేలం జరగనుంది. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం 574 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 208 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ప్లేయర్లకు అవకాశం దక్కింది.

భారత్‌కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా.. 12 మది అన్‌క్యాప్‌డ్ ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు. 70 ఓవర్‌సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగే మెగా వేలం మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియోసినిమా మెగా వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
అయితే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ మెగా వేలానికి దూరంగా ఉన్నారు. ఈ ఇద్దరూ తమ పేర్లను రిజిస్టర్ చేసుకోలేదు. విదేశీ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ తీసుకొచ్చిన కఠిన నిబంధనతోనే ఆర్చర్, గ్రీన్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకొని.. సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
గతంలో కొందరు ఆటగాళ్లు వేలంలో ఆశించిన ధర దక్కకపోతే టోర్నీ నుంచి తప్పుకునేవారు. మరికొందరూ వేలంలో అమ్ముడైన తర్వాత ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉండేవారు. ఇలాంటివారి కోసమే బీసీసీఐ నయా రూల్ తీసుకొచ్చింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున గత సీజన్ ఆడిన కామెరూన్ గ్రీన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 14 మ్యాచ్‌ల్లో 255 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 17.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ జట్టు తరఫున 16 మ్యాచ్‌ల్లో 452 పరుగులతో పాటు 6 వికెట్లు తీసాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఆర్‌సీబీ అతన్ని ట్రేడ్ చేసుకుంది.
మరోవైపు జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్‌తో పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే గాయాలతో సతమతమైన అతను.. ఐపీఎల్‌కు కూడా నిలకడగా ఆడలేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించినా.. అతను మళ్లీ మెగావేలానికి రిజిస్టర్ చేసుకోలేదు.