రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్ఫూర్తితో వరుసగా విజయాలు సాధించేందుకు కృషి చేస్తామని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. గతేడాది ఇలాంటి పరిస్థితుల్లోనే ఆర్‌సీబీ వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరిందని, వారిలా తాము ఎందుకు చేయలేమని ప్రశ్నించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో నెంబర్ 6లో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. కామిందు మెండీస్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసి జట్టు విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టు ఆడాల్సిన 5 మ్యాచ్‌లకు ఐదు గెలవాలి. మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన నితీష్ కుమార్ రెడ్డి.. ప్లే ఆఫ్స్ చేరేందుకు 110 శాతం ప్రయత్నిస్తామని తెలిపాడు.

సింపుల్ గేమ్‌తో గెలిచాం..
'ఇదో అద్భుతమైన విజయం. బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ప్రస్తుతం మేం ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఈ మ్యాచ్ గెలవడం సంతోషంగా.. గర్వంగా ఉంది. అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నా. ఈ మ్యాచ్‌లో కామిందు మెండీస్, నేను సాధారణ ఆట ఆడాం. పెద్ద షాట్లు ఆడాలనుకోలేదు. బౌలర్లు, ఫీల్డర్లపై ఒత్తిడి కూడా పెట్టలేదు. బౌండరీల కంటే క్విక్ డబుల్స్‌పై ఫోకస్ పెట్టాం. సౌకర్యవంతంగా లక్ష్యాన్ని చేధించాం.
110 శాతం ప్రయత్నిస్తాం..
పిచ్ బాగుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ తరహాలోనే టర్న్ ఉంది. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అదృష్టవశాత్తు మేం విన్నింగ్ టీమ్‌లో ఉన్నాం. ఈ విజయం మాకు అత్యంత కీలకం. ఇది చావో రేవోలాంటి మ్యాచ్. గతేడాది ఆర్‌సీబీ కూడా ఇలాంటి పరిస్థితుల నుంచే వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది. మేం ఎందుకు అలా చేయలేం..? మేం ఒక్కో మ్యాచ్‌పై ఫోకస్ పెట్టి గెలుపు కోసం 110 శాతం ప్రయత్నిస్తాం.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
కామిందు మెండీస్ ఆల్‌రౌండ్ షో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), ఆయుష్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/28) నాలుగు వికెట్లతో సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44), కామిందు మెండీస్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(2/42) రెండు వికెట్లు తీయగా. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. కామిందు మెండీస్ ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో పాటు కీలక వికెట్ తీసిన మెండీస్.. బ్యాటింగ్‌లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు.