తెలుగువాడిగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకే ఆడాలనుకున్నానని యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఈ క్రమంలోనే రూ. 6 కోట్ల తక్కువ రిటెన్షన్‌కు ఒప్పుకున్నానన్నాడు. ఇతర జట్ల నుంచి మంచి ఆఫర్స్ వచ్చినా.. కెరీర్ ఆరంభంలో తనపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాలనుకున్నానని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ జాబితాను సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిలను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.

నితీష్ కుమార్ రెడ్డికి రూ. 6 కోట్లే..
హెన్రీచ్ క్లాసెన్‌ను రూ. 23 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లను రూ. 14 కోట్లకు అట్టిపెట్టుకుంది. సంచలన ప్రదర్శనతో టీమిండియా స్టార్‌గా ఎదిగిన నితీష్ కుమార్ రెడ్డిని మాత్రం రూ. 6 కోట్లకే రిటైన్ చేసుకుంది. నితీష్ కుమార్ రెడ్డి వేలంలోకి వచ్చి ఉంటే సునాయసంగా రూ. 10 కోట్లకు పైగా పలికేవాడు. కానీ అతను రూ. 6 కోట్ల రిటెన్షన్‌కు ఒప్పకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తక్కువ ధర రిటెన్షన్‌కు ఒప్పుకోవడానికి గల కారణాన్ని నితీష్ కుమార్ రెడ్డి తాజాగా వెల్లడించాడు. ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అందించిన అవకాశాలు.. ఆ జట్టు అభిమానుల అండతోనే తాను ఈ స్థాయికి చేరానని తెలిపాడు. వారిని మరింత అలరించేందుకే తక్కువ ధర అయినా రిటెన్షన్‌కు ఒప్పకున్నానని వివరించాడు.
తెలుగు మాట్లాడే వ్యక్తిగా..
'సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం నాకెంతో గర్వకారణం. తెలుగు మాట్లాడే వ్యక్తిగా.. నేను నా ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించడం, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం గొప్పగా భావిస్తాను. ప్రైజ్ ట్యాగ్ నాకు అనవసరం. నా ఫోకస్ అంతా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టును గెలిపించడంపైనే ఉంది.
ఇతర ఫ్రాంచైజీల నుంచి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇతర ఫ్రాంచైజీలకు ఆడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే ఆడాలనుకున్నాను. నాపై నమ్మకం ఉంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ అవకాశాలు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పకొచ్చాడు.
ఆరెంజ్ ఆర్మీకి స్పెషల్ థ్యాంక్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసిన వీడియోలో నితీష్ కుమార్ రెడ్డి తెలుగులో మాట్లాడుతూ.. ఆరెంజ్ ఆర్మీ అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 'ఆరెంజ్ ఆర్మీలోని అందరికీ నమస్కారం. అప్‌కమింగ్ సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోవడం గొప్ప అనుభూతినిస్తోంది.
ఓ యువ క్రికెటర్‌కు ఐపీఎల్ ఆడటానికి మించిన అనుభూతి మరొకటి ఉండదు. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతంలోనే పుట్టి ఆ జట్టు ఆటగాడిగా ఎదిగిన నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరెంజ్ ఆర్మీ మద్దతుతోనే నేను ఈ స్థాయికి చేరాను. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను తెలుగువాడిని అవ్వడం వల్ల మీ మద్దతు నాకు ఎక్స్‌ట్రా స్పెషల్ అయ్యింది.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
Mana NKR 🔥🤩
— SunRisers Hyderabad (@SunRisers) October 31, 2024
Nitish is back to light up the field in Orange 🧡 #PlayWithFire #OrangeArmy pic.twitter.com/2QPg1VgztN