ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపుతోంది. వరుసగా 6 విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ తొలి 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు ఓడి పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ముంబై.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. జస్‌ప్రీత్ బుమ్రా జట్టులో చేరడం.. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడంతో ఆ జట్టుకు తిరుగులేకుండా పోయింది. వరుసగా సన్‌రైజర్స్, సీఎస్‌కే, లక్నో, రాజస్థాన్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలోనిలిచింది.
అసలు కథ ఇప్పుడే..
అయితే ముంబైకి అసలు పోటీ ఇప్పుడు మొదలవ్వనుంది. తమ చివరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లో ముంబై పటిష్టమైన గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు 14 పాయింట్స్‌తో ఉన్న ముంబై.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మరో రెండు మ్యాచ్‌లు గెలవాలి. తదుపరి మూడింటిలో రెండు మ్యాచ్‌లు ఓడినా ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. మూడు మ్యాచ్‌లు ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తోంది.

రెండు మ్యాచ్‌లు గెలవాలి..
మరికొద్ది సేపట్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే.. ముంబై ప్లే ఆఫ్స్ బెర్త్‌కు చేరవవుతోంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారీ వ్యత్యాసంతో ఓడకుంటే మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే 17 పాయింట్స్ సాధించాలి. అప్పుడే ఏ జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తారు. 16 పాయింట్స్ సాధిస్తే మాత్రం ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.
అలా జరిగితే..
ప్రస్తుతం ఆర్‌సీబీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆ జట్టు తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్ష్ బెర్త్ ఖాయం అవుతోంది. పంజాబ్ కింగ్స్ సైతం చివరి మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా సరిపోతుంది. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి 4 మ్యాచ్‌ల్లో రెండు గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలవాలి. ముంబై రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. ఆర్‌సీబీ, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు కావాల్సిన విజయాలు సాధిస్తే ముంబై ఇండియన్స్ ఇంటిదారి పడుతోంది. కానీ ఆ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ నేపథ్యంలో ఈజీగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.