ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధించనుండగా.. ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఐదేళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సారి ఆ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ముంబై ఫ్యాన్స్ సైతం టైటిల్ నెంబర్ సిక్స్ లోడింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా హల్‌ఛల్ చేస్తున్నారు.
ఈ సీజన్‌లో ముంబై టైటిల్ గెలిస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ముంబై నిలుస్తోంది. ఇప్పటి వరకు ముంబై ఐదు టైటిళ్లు గెలిచినా.. ఐదు సార్లు పాయింట్స్ టేబుల్‌లో నెంబర్ 2 ప్లేస్‌లో నిలిచి నేరుగా క్వాలిఫయర్-1 ఆడింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్‌తో ఇప్పటి వరకు ముంబై ఫైనల్ చేరలేదు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 4 ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు గెలిచి.. మరో రెండింటిలో ఓడింది. రెండు సార్లు గెలిచినా.. క్వాలిఫయర్-2లో ఓడి ఇంటి బాట పట్టింది. ప్రస్తుతం ఈ రికార్డ్స్ ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ గెలిచిన ఐదు ఐపీఎల్ టైటిల్స్‌లో (2013, 2015, 2017, 2019, 2020) అన్నీ లీగ్ దశలో టాప్ -2లో నిలిచినప్పుడే సాధించింది. 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ఎలిమినేటర్స్‌లో ముంబై అతిపెద్ద విజయం ఇదే. మెరుగైన రికార్డ్ ఉన్నా.. ఎలిమినేటర్ ద్వారా ఫైనల్‌కు చేరిన చరిత్ర ముంబై ఇండియన్స్‌కు లేదు.
గుజరతాల్ టైటాన్స్‌పై కూడా ముంబైకి మెరుగైన రికార్డు లేదు. ఇరు జట్ల మధ్య మొత్తం 7 మ్యాచ్‌లు జరగ్గా ముంబై రెండు మాత్రమే గెలిచింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడింది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లకు రెండింటిని ముంబై ఓడిపోయింది. వాంఖడే వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గెలుపు ముంగిట ముంబై చేతులెత్తేసింది. ఈ ఓటమి ఆ జట్టు టాప్-2 అవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి ఈ రికార్డ్‌ను సరిచేసుకోవాలని ముంబై భావిస్తోంది.