ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ముంబై టాప్-4 బ్యాటర్లు చెలరేగగా.. బౌలింగ్‌లో కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్(38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), రోహిత్ శర్మ(36 బంతుల్లో 9 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. సూర్యకుమార్ యాదవ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 నాటౌట్), హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మహీష్ తీక్షణ, రియాన్ పరాగ్ చెరో వికెట్ తీసారు.
12 ఏళ్ల తర్వాత విజయం..
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జోఫ్రా ఆర్చర్(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ(3/19), ట్రెంట్ బౌల్ట్(3/28) మూడేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/15) రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. 12 ఏళ్ల సుదర్ఘీ నిరీక్షణ తర్వాత జైపూర్ గడ్డపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

కొంపముంచిన బ్యాటింగ్ వైఫల్యం..
218 పరుగుల భారీ లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(0), యశస్వి జైస్వాల్(13) తీవ్రంగా నిరాపరిచారు. తొలి ఓవర్‌లోనే వైభవ్ సూర్యవంశీ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకోగా.. యశస్వి జైస్వాల్‌ను బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నితీష్ రాణా(9)ను బౌల్ట్ పెవిలియన్ చేర్చగా.. రియాన్ పరాగ్(16) బుమ్రా ఔట్ చేశాడు. షిమ్రాన్ హెట్‌మైర్(0)ను సూర్య స్టన్నింగ్ క్యాచ్ సాయంతో బుమ్రా డకౌట్ చేసి రాజస్థాన్ రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బతీసాడు.
పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోవడం రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. టాప్-5 బ్యాటర్లు ఏ ఈ ఇద్దరూ ఆచితూచి ఆడినా మ్యాచ్ ఆఖరి వరకు సాగేది. వైభవ్ సూర్యవంశీ వైఫల్యం రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(15) కూడా రాజస్థాన్ రాయల్స్‌ను గట్టెక్కించలేకపోయారు. జోఫ్రా ఆర్చర్(30) పోరాడినా.. మహీష తీక్షణ(2), కుమార్ కార్తీకేయ(2) వరుసగా పెవిలియన్ చేరారు. జోఫ్రా ఆర్చర్‌ను బౌల్ట్ ఔట్ చేసి ముంబై విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.