ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ యువ బౌలర్లు యుధ్ వీర్ సింగ్, ఆకాశ్ మధ్యాల్ తీన్మార్ బౌలింగ్‌తో నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది.
ఆయుష్ మాత్రే(20 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) రాణించారు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుధ్‌వీర్ సింగ్(3/47) , ఆకాశ్ మధ్వాల్(3/29) మూడేసి వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, వానిందు హసరంగా తలో వికెట్ పడగొట్టారు.

మరోసారి ధోనీ(17 బంతుల్లో సిక్స్‌తో 16) జిడ్డు బ్యాటింగ్‌తో సీఎస్‌కే భారీ స్కోర్ అవకాశాలు దెబ్బతీసాడు. ధోనీ స్లో బ్యాటింగ్ కారణంగా డెత్ ఓవర్లలో 15 బంతుల పాటు సీఎస్‌కే ఒక్క బౌండరీ నమోదు చేయలేకపోయింది. మరోవైపు ఒత్తిడికి గురైన శివమ్ దూబే భారీ షాట్ ఆడే క్రమంలోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో ధోనీ కూడా ఔటవ్వడంతో 200 ప్లస్ స్కోర్ చేస్తుందనుకున్న చెన్నై 187 పరుగులకే పరిమితమైంది.
రాణించిన ఆయుష్ మాత్రే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి మరోసారి ఆశించిన శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే డెవాన్ కాన్వే(10), ఉర్విల్ పటేల్(0) పెవిలియన్ చేరారు. అశ్విన్‌తో కలిసి ఆయుష్ మాత్రే చెలరేగాడు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని తుషార్ దేశ్‌పాండే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలోనే సీఎస్‌కే 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఆ వెంటనే అశ్విన్(13)ను హసరంగా ఔట్ చేయగా.. జడేజా(1) యుధ్‌వీర్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో సీఎస్‌కే 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న డెవాల్డ్ బ్రెవిస్, దూబే
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు. 6వ వికెట్‌కు 59 పరుగులు జోడించిన అనంతరం డెవాల్డ్ బ్రెవిస్(42)ను ఆకాశ్ మధ్వాల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ధోనీతో జత కలిసిన శివమ్ దూబే తనదైన శైలిలో భారీ షాట్లు ఆడాడు. కానీ అతనికి ధోనీ నుంచి సహకారం లభించలేదు. చివర్లో దూకుడుగా ఆడే క్రమంలో శివమ్ దూబే, ధోనీ కూడా ఔటవ్వడంతో సీఎస్‌కే 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయింది.