భారత క్రికెట్ పండుగ ఐపీఎల్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది రోజుల్లోనే ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. వచ్చే రెండు నెలలపాటు యావత్ దేశం టీవీలకు అతుక్కుపోనుంది. స్టేడియంపైకప్పు తాకే బంతులు.. కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు.. అబ్బురపరిచే బౌలింగ్ ప్రేక్షకులను కనువిందు చేయనుంది. క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ఎంతో మంది అనామక ఆటగాళ్లు స్టార్లుగా ఎదిగారు. ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యుత్తమ క్రికెట్ లీగ్. ఈ టోర్నీలో ఒక్కసారైనా ఆడాలని ప్రతీ క్రికెటర్ కలలు కంటాడు. అలాంటి అత్యుత్తమ టోర్నీలో కొన్ని ఘటనలు మాయని మచ్చగా నిలిచిపోయాయి. క్రికెట్ స్ఫూర్తికి విరుద్దంగా చోటు చేసుకున్న ఈ సంఘటనలు.. ధనాధన్ లీగ్‌ను కుదిపేసాయి. భవిష్యత్తు తరాలకు గుణపాఠంగా నిలిచాయి. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కెద్దాం.!
1. 2013 స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం..
18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 2013 స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది. ఆ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అయిన శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకీత్ చావన్‌లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. బుకీలు, ఆటగాళ్ల మధ్య మొబైల్ సంభాషణల ద్వారా ఢిల్లీ పోలీసులు సదరు ప్లేయర్లను అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంలో సీఎస్‌కే టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ రాజ్ కుంద్రాలు కూడా భాగంగా ఉన్నట్లు తేలింది. దాంతో ఈ రెండు ఫ్రాంచైజీలపై బీసీసీఐ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ సంఘటన ఐపీఎల్ విశ్వసనీయతను దెబ్బతీసింది. దాంతో బీసీసీఐ, ఐసీసీ ఫిక్సింగ్ వ్యతిరేకంగా కఠిన నియమాలను అమలు చేసింది.

2. లలిత్ మోదీపై నిషేధం..
ఐపీఎల్ రూపకర్త అయిన లలిత్ మోదీపై బీసీసీఐ నిషేధం విధించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో 2010లో బీసీసీఐ అతనిపై నిషేధం విధించింది. బ్రాడ్ కాస్టింగ్ హక్కులు.. టీమ్ అమ్మకాల విషయంలో లలిత్ మోదీ మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడని బీసీసీఐ విచారణలో తేలడంతో నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది.
3.శ్రీశాంత్ చెంప దెబ్బ..
ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లోనే శ్రీశాంత్‌ను మైదానంలోనే హర్భజన్ సింగ్ కొట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన హర్భజన్.. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన శ్రీశాంత్ చెంప చెల్లమనిపించాడు. పంజాబ్ విజయానంతరం రెచ్చగొట్టేలా శ్రీశాంత్ సంబరాలు చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన హర్భజన్ చేతికి పనిచెప్పాడు. దాంతో శ్రీశాంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. మిగతా సీజన్ ఆడకుండా హర్భజన్ సింగ్‌పై బీసీసీఐ నిషేధం విధించింది.
4.షారూఖ్ ఖాన్‌పై నిషేధం..
బాలీవుడ్ బాద్‌షా, కేకేఆర్ కో ఓనర్ షారూఖ్ ఖాన్.. వాంఖడే స్టేడియం సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడటం తీవ్ర వివాదాస్పదమైంది. 2012లో ఈ ఘటన చోటు చేసుకోగా.. తమ సెక్యూరిటీ సిబ్బంది పట్ల అసభ్యకంగా ప్రవర్తించాడని ముంబై క్రికెట్ అసోసియేషన్ షారూఖ్ ఖాన్‌ను మైదానంలోకి రాకుండా ఐదేళ్లు నిషేధం విధించింది. తన పిల్లలపై చేయి వేయడంతోనే తాను ఆగ్రహానికి గురయ్యానని షారూఖ్ సంజాయిషీ ఇవ్వడంతో ఆ నిషేధాన్ని 2015లో ఎత్తేసారు.
5.బ్యాట్ విసిరేసిన పోలార్డ్..
ముంబై ఇండియన్స్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్.. మిచెల్ స్టార్క్‌పై కోపంతో బ్యాట్‌ను విసిరేసాడు. 2014లో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలార్డ్ పక్కకు తప్పుకుడా స్టార్క్ బౌన్సర్ సంధించడంతో ఆగ్రహానికి గురైన అతను బ్యాట్ విసిరేసాడు. ఇద్దరి మ్యాచ్ ఫీజులో కోతను విధిస్తూ చర్యలు తీసుకున్నారు.
6. అంపైర్లతో ధోనీ గొడవ..
ప్రశాంతంగా కనిపించే ధోనీ.. 2019 సీజన్‌లో అంపైర్లకు తన ఉగ్రరూపం చూపించాడు. రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో నోబాల్ ప్రకటించి వెనక్కి తీసుకోవడంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డగౌట్ నుంచి మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవ్వగా.. ధోనీకి జరిమానా విధించారు.
7. జడేజాపై నిషేధం..
ఐపీఎల్ 2010 సీజన్‌లో టోర్నీ నిబంధనలు ఉల్లఘించాడనే కారణాలతో జడేజాను ఆ సీజన్ ఆడకుండా నిషేధం విధించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఉండగానే.. ఇతర జట్లలోకి వెళ్లేందుకు సంప్రదింపులు జరపడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.
8. గంభీర్ X కోహ్లీ గొడవ..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్‌లో రెండు సార్లు గొడవపడ్డారు. ఐపీఎల్ 2012లో ఆర్‌సీబీ బ్యాటర్‌గా ఉన్న కోహ్లీ.. కేకేఆర్ కెప్టెన్ అయిన గంభీర్‌పై దూసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటలు హద్దులు ధాటడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా గంభీర్, కోహ్లీ మరోసారి గొడవపడ్డారు. ఈ సారి గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా ఉండగా.. కోహ్లీ ఆర్‌సీబీ తరఫున ఆడాడు. ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం కోహ్లీ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. కైల్ మేయర్స్‌తో మాట్లాడుతుండగా.. గంభీర్ వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. దాంతో కోహ్లీ ఆగ్రహానికి గురవ్వగా.. గంభీర్ ధీటుగా బదులిచ్చాడు. ఇద్దరి మ్యాచ్ ఫీజుల్లో కోత పడింది.