టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్‌కు కావాల్సిన ఫిట్‌నెస్ సాధించే పనిలో పడ్డాడు. రాంచీ క్రికెట్ స్టేడియంలో ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
సీఎస్‌కే తమ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించనప్పటికీ.. ధోనీని ఆ జట్టు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సీఎస్‌కే రిటెన్షన్‌కు ధోనీ అంగీకరించాడని అతన్ని సన్నిహితుడు ఒకరు తెలిపారు.

అనామక ప్లేయర్‌గా ధోనీకి రూ. 4 కోట్ల వేతనం దక్కనుంది. ధోనీ కోసమే బీసీసీఐ పక్కకు పెట్టిన రూల్‌ను తీసుకొచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లు పూర్తియిన భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్లుగా భావించేవారు. 2018 మెగా వేలం తర్వాత ఈ రూల్‌ను తొలగించారు. ధోనీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పట్టుబట్టడంతో బీసీసీఐ మళ్లీ ఆ రూల్‌ను ప్రవేశపెట్టింది.
2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. దాంతో అతన్ని అనామక ప్లేయర్‌గా సీఎస్‌కే రిటైన్ చేసుకోవచ్చు. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే ధోనీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతను అప్‌కమింగ్ సీజ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
అతని వయసు, గాయాల చరిత్ర దృష్ట్యా అతను కొన్ని మ్యాచ్‌ల వరకు బ్యాటింగ్ మాత్రమే చేయనున్నాడు. ధోనీ సారథ్యంలోనే సీఎస్‌కే ఇప్పటి వరకు 5 టైటిళ్లు గెలిచింది. గత సీజన్‌కు ముందు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ.. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై మెరుగైన ప్రదర్శన చేయలేదు.
ఐపీఎల్ 2025 సీజన్‌కు అందుబాటులో ఉండటంపై ధోనీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వనాథన్ ధోనీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
''చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ ఆడాలని మేం కోరుకుంటున్నాం. కానీ ధోనీ తన అందుబాటు గురించి ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. అక్టోబర్ 31వ తేదీ లోపు చెప్తానని ధోనీ అన్నాడు. అతను ఆటను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా'' అని చెప్పాడు.