అభిమానుల కోసమే 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడుతున్నానని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞత చెప్పేందుకు తనకు ఉన్న ఏకైక మార్గం ఇదేనని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అనామక ప్లేయర్‌గా బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనీ తొలి మ్యాచ్‌లోనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే స్టంపింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అయితే ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో అధికార బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్‌కు ధోనీ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నేను ఎప్పుడూ చెప్పేది ఇదే. అభిమానుల ప్రేమకు కృతజ్ఞత తెలిపేందుకే ఐపీఎల్ ఆడుతున్నాను. నేను చాలా ఏళ్లుగా ఐపీఎల్‌లో కొనసాగుతున్నా. ఇంకెన్నాళ్లు ఆడుతానో తెలియదు. కానీ అభిమానులు నాపై చూపించే ప్రేమ, ఇచ్చే మద్దతు మాత్రం అద్భుతం. ఒక అథ్లెట్ కోరుకునేది అభిమానుల ప్రశంసలు మాత్రమే.

ప్రస్తుతం నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు కాబట్టి నాకు ఉన్న ఏకైక ఆప్షన్ ఐపీఎల్. ఇతర ఫ్రాంచైజీల ఫ్యాన్స్ కూడా నా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. నేను బాగా రాణించాలని కోరుకుంటారు. వారి అభిమాన జట్టుతో ఆడుతున్నప్పటికీ నేను బాగా ఆడాలని కోరుకుంటారు. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తుంది.
నేను బ్యాటింగ్ వెళ్లినప్పుడు స్కోర్ బోర్డును చూస్తాను. జట్టు నా నుంచి ఏం ఆశిస్తుందో నాకు తెలిసిపోతుంది. కొన్ని బంతులు మాత్రమే మిగిలి ఉంటే భారీ షాట్స్ ఆడుతాను. అదే విధంగా ఫీల్డింగ్‌లో బౌలర్లకు కొన్ని సూచనలు చేస్తాను. ఒక ఓవర్‌లో నాలుగు బౌండరీలు ఇచ్చినా.. చివరి రెండు బంతులు డాట్ చేస్తే మనకు విజయం దక్కుతుందని చెబుతాను. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచిస్తాను. మా జట్టులో 99 శాతం తీసుకునే నిర్ణయాలు రుతురాజ్‌వే. నేను వెనకుండి ఏమీ చేయను. కేవలం ఏమైనా సాయం చేయమంటేనే ఆ సమయానికి చేస్తాను. జట్టును అతను అద్భుతంగా నడిపిస్తున్నాడు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.