ఐపీఎల్ 2025 సీజన్‌లో టాప్-3లో నిలిచిన జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో తడబడుతున్నాయి. వరుసగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో టాప్-3 టీమ్స్ ఓడిపోయాయి. లక్నో చేతిలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్‌సీబీ ఓడగా.. తాజాగా పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. ఈ మూడు జట్లతో పాటు ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. ఈ నాలుగు జట్లు టాప్-2 ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఆర్‌సీబీ, గుజరాత్, పంజాబ్ ఓటముల నేపథ్యంలో పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచేందుకు ముంబై ఇండియన్స్‌కు గోల్డెన్ ఛాన్స్ లభించింది.
పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే టాప్-2లో నిలవనుంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 18 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ 17 పాయింట్స్‌తో రెండు, మూడు స్థానంలో కొనసాగుతున్నాయి. ముంబై ఇండియన్స్ 16 పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉంది.

ఆర్‌సీబీ టాప్-2లో నిలవాలంటే..
లక్నోతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధిస్తే 19 పాయింట్స్‌తో టాప్-2లో నిలుస్తుంది. ఓడితే మాత్రం టాప్-2 ప్లేస్ రేసు నుంచి తప్పుకుంటుంది.
గుజరాత్ అవకాశాలు ఏంటంటే..?
సీఎస్‌కేతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే 20 పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఓడినా.. మెరుగైన రన్‌రేట్‌తో ఉంటే టాప్-2లో చోటు దక్కుతుంది. కానీ పంజాబ్, ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అలా కాకుండా సీఎస్‌కే చేతిలో గుజరాత్ ఓడి.. ముంబైపై ఆర్‌సీబీ, లక్నోపై ఆర్‌సీబీ గెలిస్తే మాత్రం టాప్ ప్లేస్ గల్లంతవుతుంది.
పంజాబ్ కింగ్స్ ఛాన్స్..
ముంబై ఇండియన్స్‌పై విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ టాప్-2 ప్లేస్ ఖరారవుతోంది.అయితే ఆర్‌సీబీ, గుజరాత్ జట్లు తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్‌సీబీ, గుజరాత్ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా.. ఆర్‌సీబీ కంటే నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉంటే టాప్-2 ప్లేస్ దక్కుతుంది.
ముంబై టాప్-2 ప్లేస్ చేరాలంటే..?
పంజాబ్ కింగ్స్‌పై ముంబై విజయం సాధించడంతో పాటు లక్నో చేతిలో ఆర్‌సీబీ ఓడిపోవాలి. లేదంటే సీఎస్‌కే చేతిలో గుజరాత్ టైటాన్స్, లక్నో చేతిలో ఆర్‌సీబీ ఓడి.. పంజాబ్‌పై ముంబై విజయం సాధిస్తే టాప్ ప్లేస్ ఖరారవుతోంది.