ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన నాకౌట్ తరహా మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడుగా.. మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(3/12) నిప్పులు చెరగడంతో సునాయస విజయాన్నందుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చివరి మ్యాచ్ గెలిచినా.. ముంబైని అధిగమించే పరిస్థితి లేకపోవడంతో ఢిల్లీ ఇంటిబాట పట్టింది.
ముంబై ఇండియన్స్ ఛీటింగ్..?
అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఛీటింగ్ చేసిందనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. అంపైర్లు ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా వ్యవహరించారని, ముఖేష్ అంబానీ తన డబ్బులతో అందర్ని కొనేశాడని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ముంబై విజయం సాధించిన ప్రతీసారి ఇలాంటి కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే ఈ సారి కొన్ని వీడియోలు, ఫొటోలను జత చేసి మరి ముంబై ఇండియన్స్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

అంపైర్లు అమ్ముడుపోయారా..?
అంపైర్లు ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సిక్స్ అయితే బౌండరీ ఇచ్చారని, కనీసం చెక్ కూడా చేయలేదని, అభిషేక్ పోరెల్ స్టంపౌట్ విషయంలోనూ నాటౌట్ అయితే ఔటిచ్చారని, మిచెల్ సాంట్నర్ వైడ్ నోబాల్ వేస్తే ఇవ్వలేదని స్క్రీన్ షాట్స్‌తో సహా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. స్టబ్స్ ఎల్బీ విషయంలోనూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బంతి లెగ్ స్టంప్ మిస్సయ్యాలే ఉంటే.. బాల్ ట్రాకింగ్‌లో మాత్రం తాకినట్లు చూపించారని పేర్కొంటున్నారు. డబ్బులుంటే ఐపీఎల్ ట్రోఫీలు గెలవచ్చని, అంబానీ నిరూపించారని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎడిటెడ్ ఫొటోలు, వీడియోలు అని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.
నిజం ఏంటంటే..?
రిప్లేలోని సైడ్ యాంగిల్స్ విజువల్స్‌ను బట్టి నెటిజన్లు అంపైర్లను తప్పుబడుతున్నారు. కానీ నెటిజన్లు ఆరోపిస్తున్నట్లు ఎలాంటి ఘోర తప్పిదం జరగలేదు. మ్యాచ్‌ను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. ముంబై ఇండియన్స్ విజయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఈ నెటిజన్లు ఈ ఆరోపణలను గుప్పిస్తున్నారు.
ముంబైని గెలిపించిన 2 ఓవర్లు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 39), విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(3/12) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసారు.