ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ పలకనున్నాడా? అతని కోసం రూ. 50 కోట్లు అయినా చెల్లించేందుకు ఫ్రాంచైలు సిద్దంగా ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథిగా ఐదు టైటిళ్లు సాధించాడు.
ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను తమ నూతన సారథిగా ఎంపిక చేసింది.

అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు కూడా రోహిత్ సిద్దమయ్యాడనే వార్తలు వచ్చాయి. ఐపీఎల్ సందర్భంగా రోహిత్ మాట్లాడిన ఓ ప్రైవేట్ సంభాషణకు సంబంధించిన వీడియో ఈ వార్తలకు బలం చేకూర్చింది.
ఒకవేళ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వదిలి వేలంలోకి వస్తే మాత్రం అతను ఆల్‌టైమ్ రికార్డ్ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నాయని, రూ. 50 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్దంగా ఉన్నాయని ఓ స్పోర్ట్స్ ఛానెల్ ప్రతినిధి అన్నాడు.
ఇప్పటికే ఈ రెండు జట్లు రోహిత్ శర్మ కోసం రూ. 50 కోట్లు సిద్దం చేసుకున్నాయని చెప్పాడు. దాంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి. లక్నో, ఢిల్లీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. రోహిత్‌తో ఆ కోరిక నెరవేర్చుకోవాలని ఈ రెండు జట్లు భావిస్తున్నాయి. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రికార్డ్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో అతన్ని రూ. 24.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇదే వేలంలో ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.5 కోట్లకు తీసుకుంది.
ప్రస్తుతం ఐపీఎల్ టీమ్స్ పర్స్ వాల్యూ రూ. 100 కోట్లుగా ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ పర్స్ వాల్యూ 20-25 కోట్లు పెంచే అవకాశం ఉంది. రూ. 120-125 కోట్లకు పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ రూ. 125 కోట్లకు పెరిగినా.. ఒక్క ప్లేయర్‌కు రూ. 50 కోట్లు ఖర్చు చేయడం చాలా కష్టం. రోహిత్ శర్మ ఒక్కడికే 50 కోట్లు ఖర్చు చేస్తే.. మిగతా రూ. 75 కోట్లతో మిగతా 24 మంది ఆటగాళ్లను తీసుకోవడం కష్టం.
పూర్తిగా దేశవాళీ ఆటగాళ్లపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు రోహిత్ శర్మ జట్టులో ఉన్నా.. టీమ్ బలహీనంగా ఉంటుంది. ఏ లెక్కన చూసుకున్నా.. ఓ ఆటగాడు గరిష్టంగా రూ. 30-35 కోట్లకు మించి పలకలేడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.