స్వేచ్ఛగా ఆడటంతో పాటు ఫ్రెష్‌గా కెరీర్‌ను రీస్టార్ట్ చేయాలనే లక్ష్యంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును వీడినట్లు ఆ జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు లక్నో జట్టు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే.
జట్టులో కొనసాగేందుకు లక్నో సూపర్ జెయింట్స్ కన్విన్స్ చేసిన రాహుల్ ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కూడా పరోక్షంగా రాహుల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడేవారు తమకు అవసరం లేదని రాహుల్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో జట్టును వీడటానికి గల కారణాలను, తన లక్ష్యాలను వెల్లడించాడు. మరింత స్వేచ్చగా ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయడమే తన లక్ష్యమని, అందుకు ఐపీఎల్ 2025 సీజన్‌ను వారధిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు.
'నా టీ20 కెరీర్‌ను మళ్లీ ఫ్రెష్‌గా ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకు గల అవకాశాలను అన్వేషిస్తున్నాను. స్వేచ్ఛగా ఆడే పరిస్థితులున్న జట్టులోకి వెళ్లాలనుకుంటున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలిగే పరిస్థితులున్న జట్టు కోసం ఎదురు చూస్తున్నా. మనకు మంచి జరగాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే.
నేను కొంతకాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నాను. ఆటగాడిగా నేను ఎక్కడ ఉన్నానో నాకు బాగా తెలుసు. పూర్వవైభవం రావడానికి ఏం చేయాలో కూడా తెలుసు. కాబట్టి అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్‌ను అందుకు వేదికగా వాడుకోవాలనుకుంటున్నాను. నా ఆటను ఆస్వాదించాలనుకుంటున్నాను. భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఎంపికైన రాహుల్.. వరుసగా మూడు సీజన్లలో ఆ జట్టును నడిపించాడు. గత సీజన్ మినహా ఆ జట్టు రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. గత సీజన్‌లో అటు బ్యాటర్‌గా.. ఇటు సారథిగా రాహుల్ విఫలమయ్యాడు. నిలకడలేమి ఆటతో పాటు జిడ్డు బ్యాటింగ్‌తో రాహుల్ తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఈ ప్రదర్శనతో భారత టీ20 జట్టుకు దూరమయ్యాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేఎల్ రాహుల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్‌కమింగ్ సీజన్‌లో అతను కెప్టెన్‌గా కాకుండా సాధారణ ఆటగాడిగా కొనసాగవచ్చు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్(రూ. 21 కోట్లు)తో పాటు రవి బిష్ణోయ్(రూ. 11 కోట్లు), మయాంక్ యాదవ్(రూ. 11 కోట్లు), మోహ్‌సిన్ ఖాన్(రూ. 4 కోట్లు), ఆయుష్ బదోని(రూ. 4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది.