టీమిండియా వెటరన్ బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే చరిత్ర సృష్టించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మార్చి 22న కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య జరిగే మ్యాచ్‌తో రహానే ఈ ఫీట్ సాధించనున్నాడు. ఇటీవలే అజింక్యా రహానేను కేకేఆర్ తమ కెప్టెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. వెంకటేశ్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన కేకేఆర్.. వెటరన్ బ్యాటర్ రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
గతంలో రహానే రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించాడు. 2017లో స్టీవ్ స్మిత్‌కు డిప్యూటీగా ఓ మ్యాచ్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ను నడిపించాడు. ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్,చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రహానే ఆటగాడిగానే కొనసాగాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రహానేను కేకేఆర్ కొనుగోలు చేసింది.

తమ మాజీ కెప్టెన్ పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిపోవడంతో రహానేను సారథిగా నియమించింది. మరోవైపు రహానే తర్వాత మూడు వేర్వేరు జట్లకు సారథిగా వ్యవహరించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలవనున్నాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు కేకేఆర్, పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2018 నుంచి 2020 వరకు ఢిల్లీ సారథిగా వ్యవహరించిన అయ్యర్.. ఐపీఎల్ 2022లో కేకేఆర్‌కు వెళ్లాడు. రెండు సీజన్ల పాటు జట్టును నడిపించిన అతను గత సీజన్‌లో విజేతగా కూడా నిలబెట్టాడు.