ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సమయాత్తమవుతోంది. గత సీజన్ రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. మెగా వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే తమ కోర్ టీమ్‌లోని ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. అందుకనుగుణంగా టీమ్ నిర్మించాలనుకుంటోంది.
విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌ను రూ. 23 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 18 కోట్లకే తీసుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. నితీష్ కుమార్ రెడ్డిని రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ ఐదుగురి కోసం ఏకంగా రూ. 75 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్టు పర్స్‌లో ఇంకా రూ. 45 కోట్లు ఉండగా.. ఓ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉంది.

రిటెన్షన్‌లో విదేశీ ఆటగాళ్లనే ముగ్గురిని తీసుకున్న సన్‌రైజర్స్.. వేలంలో భారత ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి వేలంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్యమారన్ మార్క్ సెలెక్షన్ ఉండనుంది. రూ. 10 కోట్లలోపు పలికే భారత ఆటగాళ్లపై ఆరెంజ్ ఆర్మీ కన్నేసింది. ఆ జాబితాపై ఓ లుక్కెద్దాం.
1.టీ నటరాజన్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ అయిన టీ నటరాజన్‌ను తిరిగి కొనుగోలు చేయనుంది. అతను రూ. 5-10 కోట్ల మధ్య లభించే అవకాశం ఉంది. గత సీజన్‌లో నటరాజన్ 19 వికెట్లతో సత్తా చాటాడు.
2. మహమ్మద్ సిరాజ్..
హైదరాబాద్ లోకల్ స్టార్ మహమ్మద్ సిరాజ్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేసింది. ఆరెంజ్ ఆర్మీ తరఫునే (2015-17) ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి స్టార్ పేసర్‌గా ఎదిగిన సిరాజ్.. తిరిగి జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయనుంది.
3. రవిచంద్రన్ అశ్విన్..
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా సన్‌రైజర్స్ కన్నేసింది. కెరీర్ చివరి దశలో ఉన్న అశ్విన్ అనుభవాన్ని వాడుకోవాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్ ఉంది.
4. వెంకటేశ్ అయ్యర్..
కేకేఆర్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్, మిడిలార్డర్‌లో ఆడే సత్తా కలిగిన వెంకటేశ్ అయ్యర్‌ను కూడా సన్‌రైజర్స్ టార్గెట్ చేసింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో అతనికి ప్రాధాన్యత ఇస్తోంది. అయితే కేకేఆర్ అతన్ని తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. రూ. 5 కోట్ల లోపు పలికితే తీసుకునే ఛాన్స్ ఉంది.