టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాను ముంబై ఇండియన్స్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే ముంబై ఇండియన్స్ తమ కోర్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.
అనూహ్యంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను తమ ఫస్ట్ రిటెన్షన్‌గా రూ. 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను నాలుగో ప్లేయర్‌గా రూ. 16 కోట్లకు అట్టిపెట్టుకుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ తన సాలరీ క్యాప్‌ను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే బుమ్రాను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడంతో ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అత్యధిక సాలరీ అందుకున్న ఆటగాడిగా అతను రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో అతను కామెరూన్ గ్రీన్ హయ్యెస్ట్ ప్రైజ్ రూ. 17.50 కోట్ల రికార్డ్‌ను అధిగమించాడు. ఐపీఎల్ 2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన జస్‌ప్రీత్ బుమ్రా.. మూడు ఫార్మాట్లలో వరల్డ్ బెస్ట్ పేసర్‌గా ఎదిగాడు.
రిటైన్ చేసుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం ముంబై ఇండియన్స్ రూ. 70 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్టు పర్స్‌లో ఇంకా రూ. 50 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బుతోనే ముంబై మిగతా 17-19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడంతో ముంబై ఇండియన్స్‌కు ఒక ఆర్‌టీఎమ్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్ ద్వారా ఇషాన్ కిషన్‌ను వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చు. లేదా ఇతర ఆటగాళ్లను తీసుకోవచ్చు.
తమ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే కొనసాగుతాడని ముంబై ఇండియన్స్ స్పష్టం చేసింది. ఇక టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తనకి ఈ ధర సరైనదేనని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. 'రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ స్థానం నాకు సరైనదే అని భావిస్తున్నాను. జాతీయ జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను నమ్ముతాను. నా రిటెన్షన్‌పై నేను సంతోషంగా ఉన్నాను'' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.