ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అభిషేక్ శర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) దూకుడుగా ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో రోమారియో షెఫర్డ్(2/14) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్(17) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ 3.3 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ప్రమాదకరంగా ఆడుతున్న ఈ జోడీని లుంగి ఎంగిడి విడదీసాడు. అభిషేక్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే ట్రావిస్ హెడ్‌ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్ అదే దూకుడును కొనసాగించారు. దాంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లకు 71 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ విధ్వంసం..
భారీ సిక్స్‌లు బాదిన హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24)ను సుయాష్ శర్మ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన అనికేత్ వర్మ(9 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) కూడా భారీ సిక్స్‌లు బాదాడు. అతన్ని కృనాల్ పాండ్యా ఔట్ చేయగా.. నితీష్ కుమార్ రెడ్డి(4)ని రొమారియో షెపెర్డ్ పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఇషాన్ కిషన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభినవ్ మనోహర్(12) ఔటైనా.. ప్యాట్ కమిన్స్ సాయంతో ఇషాన్ కిషన్ చెలరేగాడు.