ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. ఇప్పటికే రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. గరిష్టంగా ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం లేదా వేలంలో ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి కొనుగులు చేసే అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లు.. ఇద్దరూ అనామక ప్లేయర్లను తీసుకోవచ్చని పేర్కొంది.
విదేశీ ఆటగాళ్ల విషయంలో ఎలాంటి పరిమితులు విధించలేదు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలని, మరో ఇద్దరిని రిటైన్ చేసుకోవాలంటే మళ్లీ రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. అనామక ఆటగాళ్లకు రూ. 4 కోట్లు చెల్లించాలని తెలిపింది. టీమ్ పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలను ఆదేశించింది.

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్లుగా పరిగణించే పాత రూల్‌ను బీసీసీఐ మళ్లీ ప్రవేశపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ కోసం సీఎస్‌కే ఈ రూల్ కోసం పట్టుబట్టినట్లు సమాచారం.
బీసీసీఐ కూడా ధోనీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో వారి డిమాండ్‌ను అమలు చేసింది. ధోనీని సీఎస్‌కే అనామక ప్లేయర్‌గా రూ.4 కోట్లకే రిటైన్ చేసుకోవచ్చు. నవంబర్ 30న మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టేలోపే ఐపీఎల్ మెగా వేలం నిర్వహణ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. డిసెంబర్ తొలి వారంలో జై షా... ఐసీసీ పగ్గాలను అందుకోనున్నాడు. మరోవైపు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ఇప్పటికే సిద్దం చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌తో పాటు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమా .. రిటెన్షన్ జాబితాలకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశాయి. దీపావలి(అక్టోబర్ 31) గురువారం సాయంత్రం 4.30 గంటల నుంచి పది ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను ప్రకటిస్తామని పేర్కొన్నాయి. పండుగ రోజు సాయంత్రం.. తమకు నచ్చిన జట్ల రిటెన్షన్ జాబితాలను ఫ్యాన్స్ చూడవచ్చు.
జియోసినిమాలో ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా వీక్షించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇందుకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐపీఎల్ రిటెన్షన్‌కు సంబంధించిన అంచనాలు, ఊహాజనిత కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి.