ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. డిఫెండింగ్ రన్నరప్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లోనే 286 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగులేదని అంతా అనుకున్నారు. 300 పక్కా అంటూ మురిసిపోయారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికిలపడింది.
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు మాత్రమే నమోదు చేసిన ఆరెంజ్ ఆర్మీ 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే లీగ్‌లో మిగిలిన 5 మ్యాచ్‌లకు ఐదు గెలవాలి. ఒక్కటి ఓడినా ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి. రెండు ఓడితే అధికారికంగా రేసు నుంచి తప్పుకుంటుంది. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి డూ ఆర్ డై అన్నట్లు తయారైంది.

ఆర్‌సీబీ జెర్సీలో నితీష్ రెడ్డి తండ్రి..
గుజరాత్ టైటాన్స్‌తో మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ 10వ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఫొటో సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఫొటో ఎవరిదో కాదు.. సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డిది. జిమ్‌లో దిగిన ఆ ఫొటోలో ముత్యాల రెడ్డి ఆర్‌సీబీ జెర్సీని ధరించాడు. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. కొడుకుది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే.. తండ్రి ఆర్‌సీబీకి మద్దతు తెలుపుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఆర్‌సీబీ అభిమాని అయిన ఓ రెడ్‌ఇట్ యూజర్.. 'నితీష్ కుమార్ రెడ్డి తండ్రి..'అనే క్యాప్షన్‌కు లవ్ ఎమోజీ జత చేసి షేర్ చేశాడు. క్షణాల్లో ఈ ఫొటో వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ముత్యాల రెడ్డి.. విరాట్ కోహ్లీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అని, అందుకే ఆర్‌సీబీకి అండగా నిలుస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్‌కు ఆడకముందు నితీష్ రెడ్డి కూడా ఆర్‌సీబీ ఫ్యాన్ అని గుర్తు చేస్తున్నారు.
అంకుల్ జెర్సీ మార్చేశాడు..
మరికొందరు మాత్రం సన్‌రైజర్స్ ఆట చూడలేక అంకుల్.. జెర్సీని మార్చేసాడని సెటైర్లు పేల్చుతున్నారు. 'మీ అయ్య కూడా జెర్సీ మార్చేసాడు రెడ్డి'అని పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ సీజన్‌లో నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడు. గాయం కారణంగా బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైన నితీష్ రెడ్డి.. 9 మ్యాచ్‌ల్లో 21.71 సగటుతో 152 పరుగులే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు.
మరోవైపు ఈ సీజన్‌లో ఆర్‌సీబీ దుమ్మురేపుతోంది. 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు విజయం దూరంలో నిలిచింది.