ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన సమస్యలు పరిష్కారమయ్యాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రకటించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులతో మంగళవారం చర్చలు జరిపి ఈ వివాదానికి ముంగిపు పలికామని తెలిపింది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల ఫ్రీ పాస్‌ల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్, హెచ్‌సీఏ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఫ్రీ పాసుల కోసం హెచ్‌సీఏ తమను వేధిస్తుందని సన్‌రైజర్స్ మేనేజర్ రాసిన మెయిల్ మీడియాకు లీకవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.
చివరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో హెచ్‌సీఏ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంగళవారం హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ అధ్యక్షతన మంగళవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశ వివరాలతో పాటు వివాదం ముగిసిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్-హెచ్‌సీఏ సంయుక్తంగా మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశాయి.

'హెచ్‌సీఏకు వ్యతిరేకంగా మీడియా వేదికగా వచ్చిన వార్తల నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్రతినిధులతో హెచ్‌సీఏ సమావేశం నిర్వహించింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన ఈ సమావేశంలో కిరణ్, శరవణన్, రోహిత్ సురేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ నిబంధనల మేరకు స్టేడియం కెపాసిటీలో 10 శాతం టికెట్లను కాంప్లిమెంటరీ పాస్‌లుగా ఇచ్చేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది. సంప్రదాయం ప్రకారం స్టేడియంలోని ప్రతీ కేటగిరిలో 10 శాతం టికెట్లు కేటాయించాలని హెచ్‌సీఏ చేసిన ప్రతీపాదనకు ఎస్ఆర్‌హెచ్ సీఈఓ షణ్ముగం టెలిఫోన్ ద్వారా అంగీకరించారు.
ఈ లెక్కన హెచ్‌సీఏకు 3900 కాంప్లిమెంటరీ పాస్‌లు వస్తాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పూర్తిగా సహకరిస్తామని హెచ్‌సీఏ పేర్కొంది. ఈ సమావేశంలో హెచ్‌సీఏ-ఎస్‌ఆర్‌హెచ్ మధ్య నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభించింది. ప్రేక్షకులకు మంచి సౌకర్యాలు కల్పించేందుకు హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ కలిసి పనిచేస్తుంది.'అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు దూరంగా ఉన్నారు. ఈ గొడవ సద్దుమణిగిందని ఆయన ట్వీట్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.