ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ అభిమానులకు ఓ అభ్యర్థన చేశాడు. ఈ సారి తాను మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు హేళన చేయకుండా అండగా నిలవాలని కోరాడు. బ్యాటింగ్ చేసే సమయంలో.. టాస్ సందర్భంగా మైదానంలోకి వచ్చినప్పుడు తనను ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యాను సొంత అభిమానులే గేలి చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు కట్టబెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. సీజన్ మొత్తం అతనిపై విమర్శలు గుప్పించారు. టాస్ సమయంలో.. బ్యాటింగ్ చేసేటప్పుడు రోహిత్ అని గట్టిగా అరుస్తూ దారుణంగా అవమానించారు. కెప్టెన్సీ ఆఫర్‌తోనే గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడని, హార్దిక్ కారణంగానే రోహిత్ సారథ్యం కోల్పోయాడని ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు.

తీవ్ర మానసిక క్షోభ..
ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమై పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. సొంత అభిమానుల చేత ఘోర అవమానానికి గురైన హార్దిక్ పాండ్యా తీవ్ర మానసిక క్షోభను అనుభవించాడు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి అద్భుతంగా పుంజుకొని టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగించింది.
ప్లీజ్.. సపోర్ట్ చేయండి
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన హార్దిక్ పాండ్యా అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 'నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు నన్ను ప్రోత్సహించండి. నేను సిక్స్ కొట్టినప్పుడు గట్టిగా అరుస్తూ మరింత మద్దతు తెలపండి. టాస్ కోసం వచ్చినప్పుడు.. బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు అండగా నిలవండి. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జెర్సీ కలర్ తప్పా మరే రంగును చూడకూడదనుకుంటున్నా. మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలు గతేడాది అతనికి జరిగిన అవమానాన్ని మరిచిపోలేదనే విషయాన్ని సూచిస్తున్నాయి. నిషేధం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నాడు.