ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ గొడవపడ్డారు. ఒకరికొకరు సీరియస్‌గా చూసుకున్నారు. కంటి చూపులతోనే వార్నింగ్ ఇచ్చుకున్నారు. 'ఛల్ పో.. బే'అన్నట్లు హార్దిక్ పాండ్యా సైగ చేశాడు. ఫీల్డ్ అంపైర్ ఇద్దరి మధ్యలోకి పరుగెత్తుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిదంటే..?
సాయి కిషోర్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని హార్దిక్ పాండ్యా ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతిని హార్దిక్ పాండ్యా డిఫెన్స్ చేయగా.. బౌలర్ వైపు కొంత దూరం వెళ్లి ఆగింది. ఇద్దరూ ఒకరినొకరు సీరియస్‌గా చూసుకున్నారు. బౌలర్‌వైపు హార్దిక్ పాండ్యా దూసుకురాగా.. సాయి కిషోర్ కూడా నిలబడి ధీటుగా బదులిచ్చాడు. దాంతో అంపైర్ పరుగెత్తుకు రాగా.. హార్దిక్.. దూరంగా వెళ్లని సైగలు చేశాడు.

మ్యాచ్ అనంతరం నవ్వుతూ హాగ్..
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా నవ్వుతూ హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
మేం బెస్ట్ ఫ్రెండ్స్..
మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన సాయి కిషోర్‌ను ఈ గొడవ గురించి ప్రశ్నించగా.. తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపాడు. మైదానంలో అలానే ఉంటామని, ఆటలో జరిగేవి వ్యక్తిగతంగా తీసుకోమని చెప్పాడు. 'హార్దిక్ పాండ్యా నాకు మంచి స్నేహితుడు. మైదానంలో మేం ప్రత్యర్థులం కాబట్టి అలానే తలపడుతాం. అయితే ఆటలో జరిగే ఘటనలను వ్యక్తిగతంగా తీసుకోం'అని సాయి కిషోర్ వివరణ ఇచ్చాడు.
చెలేగిన ప్రసిధ్, సిరాజ్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్(27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), జోస్ బట్లర్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/29) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మా న్, సత్యనారాయణ రాజు తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 48), తిలక్ వర్మ(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39) మాత్రమే రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, సాయి కిషోర్ తలో వికెట్ తీసారు.