ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. విల్ జాక్స్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53), సూర్యకుమార్ యాదవ్(24 బంతుల్లో 5 ఫోర్లతో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ తీసారు. విల్ జాక్స్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు, సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఓ క్యాచ్ వదిలేయడంతో ముంబై పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
మూడు క్యాచ్‌లు నేలపాలు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే ర్యాన్ రికెల్టన్(2) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో విల్ జాక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కవర్స్‌లో సాయి సుదర్శన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను సిరాజ్ వేసిన మరుసటి ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు రెండు బౌండరీలు బాదాడు. రోహిత్ శర్మ(7)ను అర్షద్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. సూర్యకుమార్ వచ్చి రావడంతోనే రెండు బౌండరీలు బాదాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను మిడ్ వికెట్‌లో సాయి కిషోర్ నేలపాలు చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లో విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్‌ను మిడ్ వికెట్‌లో సిరాజ్ వదిలేసాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే విల్ జాక్స్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దే వెనుదిరిగాడు.

దూకుడుగా ఆడిన సూరీడు-జాక్స్..
ఈ అవకాశాలతో చెలరేగిన జాక్స్-సూరీడు వేగంగా పరుగులు చేశారు. సాయి కిషోర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన విల్ జాక్స్ 29 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. అదే ఓవర్‌లో సూర్య ఔటవ్వడంతో మూడో వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరుసటి ఓవర్‌లో విల్ జాక్స్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేయగా.. హార్దిక్ పాండ్యా(1)ను సాయి కిషోర్ పెవిలియన్ చేర్చాడు.
కళ్లుచెదిరే సిక్సర్..
తిలక్ వర్మ(7)ను కోయిట్జీ ఔట్ చేయగా..నమన్ ధీర్(7)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్స్ ఆడే క్రమంలో ముంబై బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో 18 బంతుల పాటు ఒక్క బౌండరీ రాలేదు. ప్రసిధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో కొర్బిన్ బాష్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27) వరుసగా రెండు సిక్స్‌లు బాది రనౌటయ్యాడు. రెండో బంతికి బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా అతను కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ధోనీ తరహా కీపింగ్ స్కిల్స్‌తో జోస్ బట్లర్ అతన్ని రనౌట్ చేశాడు. ఆఖరి బంతిని దీపక్ చాహర్ బౌండరీ బాదడంతో ముంబై 155 పరుగులు చేయగలిగింది.