ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ భారత్‌కు వచ్చేందుకు సిద్దమయ్యాడు. మే చివరి వారంలో అతను జట్టుతో కలిసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ శనివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ వాయిదా కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లలో కొంతమంది భారత్‌కు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. గాయాలు, జాతీయ జట్టు మ్యాచ్‌లతో పాటు వ్యక్తిగత కారణాలతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.

భుజగాయంతో బాధపడుతున్న జోష్ హజెల్ వుడ్ కూడా తిరిగి రావడం లేదని వార్తలు వచ్చాయి. దాంతో ఆర్‌సీబీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ సీజన్‌లో హజెల్ వుడ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 10 మ్యాచ్‌ల్లో 8.44 ఎకానమీతో 18 వికెట్లు తీసాడు. ప్లే ఆఫ్స్‌కు జోష్ హజెల్ వుడ్ అందుబాటులోకి వస్తే ఆర్‌సీబీ బలం రెట్టింపు అవ్వనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్.. ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యారు. తాను అందుబాటులో ఉండటం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. ఫ్రాంచైజీ కూడా వారి నిర్ణయాన్ని అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే జేక్ ఫ్రెజర్ స్థానంలో ముస్తఫిజుర్ రెహమాన్‌ను తీసుకుంది. విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీ నేపథ్యంలో తాత్కలిక రిప్లేస్‌మెంట్స్‌కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది.