ఐపీఎల్ 2025 ఫైనల్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ మధ్య జూన్ 3న జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ను టీవీల్లో 16 కోట్ల తొంభై లక్షలు( 169 మిలియన్ల) వ్యూస్ రాగా.. జియో హాట్‌స్టార్‌లో 16.74 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్ నమోదైంది. ఈ వివరాలను జియో హాట్‌స్టార్ గురువారం వెల్లడించింది. టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి మొత్తం 31.7 బిలియన్ నిమిషాల వీక్షణ సమయాన్ని నమోదు చేసింది. ఇది టీ20 క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌కు నమోదైన అత్యధిక వీక్షణ సమయంగా రికార్డ్‌కెక్కింది.
స్టార్ స్పోర్ట్స్‌లో 16.9 కోట్ల మంది ఆర్‌సీబీ-పంజాబ్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌ను ఇంత మంది వీక్షించడం ఇదే తొలిసారి. జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను 89.2 కోట్లు(892 మిలియన్) వ్యూస్ వచ్చాయి. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇదో చరిత్ర. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఒకేసారి గరిష్టంగా 5.5 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఇది ఒక కొత్త రికార్డ్‌గా నిలిచింది.

ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం టీవీ, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో కలిసి ఒక బిలియన్(100 కోట్ల) మందికి చేరువైంది. మొత్తం 840 బిలియన్ నిషాలకు పైగా వీక్షణ సమయం నమోదైంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. ఈ వ్యూయర్‌షిప్ రికార్డ్స్ ఐపీఎల్ క్రేజ్‌ను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ సీజన్‌తో స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ పంట పండింది. 18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరడం.. విజేతగా నిలవడంతో ఈ రికార్డ్స్ నమోదయ్యాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడటంతో పాటు కోహ్లీ కల నెరవేరింది.