ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తెలుగు ప్లేయర్లను కొనుగోలు చేయడం లేదు. ఇప్పటి వరకు జరిగిన వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్క ప్లేయర్‌ను కూడా కొనుగోలు చేయలేదు. కనీస ధరతో అందుబాటులో ఉన్న ఆటగాళ్లను తీసుకోలేదు. జట్టులో నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే తెలుగు వాడు కావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తెలుగు క్రికెటర్ల ప్రతిభను వెలికి తీయడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఆదివారం హైదరాబాద్ స్టార్ మహమ్మద్ సిరాజ్ కోసం సన్‌రైజర్స్ కనీసం బిడ్ వేయలేదు. అతన్ని గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

సోమవారం జరిగిన వేలంలో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ కోసం సన్‌రైజర్స్ బిడ్ వేయలేదు. రూ.75 లక్షల కనీస ధరకు కూడా తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు. మరో తెలుగు తేజం షేక్ రషీద్ కోసం కూడా సన్‌రైజర్స్ బిడ్ వేయలేదు. రూ.30 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్న తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు.
మరోసారి అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 30 లక్షల కనీస ధరకే సొంతం చేసుకుంది. గత సీజన్‌లోనూ షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అప్పుడు కూడా సన్‌రైజర్స్ పట్టించుకుపోగా.. రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినా.. షేక్ రషీద్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్‌గా డబుల్ సెంచరీ బాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తెలుగు ప్లేయర్లను తెలుగు ఫ్రాంచైజీలు బ్యాకప్ చేయకపోతే.. ఇంకేవరు తీసుకుంటారని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.