ఐపీఎల్ యంగ్ సెన్సేషన్, రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జైపూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ బాది సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ బిహార్ కుర్రాడు.. ముంబైతో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు.
దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన ఫుల్లర్ డెలివరీని వైభవ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి మిడాన్‌లో గాల్లోకి లేవగా.. విల్ జాక్స్ ఎలాంటి తప్పిదం చేయకుండా అద్భుతంగా అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ వైఫల్యంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కుర్రాడి సెంచరీని అతిగా పొగిడి అతనిపై అనవసరం ఒత్తిడి క్రియేట్ చేశారని కామెంట్ చేస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీపై ఏడుపు ఎక్కువైందని, దాంతోనే విఫలమయ్యాడని అభిప్రాయపడుతున్నారు. దాంతో వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై 100 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్(38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), రోహిత్ శర్మ(36 బంతుల్లో 9 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. సూర్యకుమార్ యాదవ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 నాటౌట్), హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మహీష్ తీక్షణ, రియాన్ పరాగ్ చెరో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జోఫ్రా ఆర్చర్(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ(3/19), ట్రెంట్ బౌల్ట్(3/28) మూడేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/15) రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. 12 ఏళ్ల సుదర్ఘీ నిరీక్షణ తర్వాత జైపూర్ గడ్డపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.